- మెడికల్ పీజీ సీట్ల భర్తీలో అక్రమాలు!
- నాన్ సర్వీస్ డాక్టర్లకు ఇన్‌సర్వీస్ కోటాలో సీట్లు
- కాళోజీ వర్సిటీ తీరుపై మండిపడుతున్న మెడికోలు
- సర్టిఫికెట్లను రీవెరిఫై చేయాలని డిమాండ్
- అధికారుల కనుసన్నల్లోనే అవకతవకలు జరిగాయని ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు : మెడికల్ పీజీ సీట్ల భర్తీలో మరోసారి అవకతవకలు బయటపడ్డాయి. కాళోజీ యూనివర్సిటీ చేసిన తప్పిదాలతో అనర్హులకు సీట్లు దక్కగా.. అర్హులు సీటు పొందే అవకాశాన్ని కోల్పోయారు. ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్లకు పీజీ సీట్ల భర్తీలో ఇన్‌సర్వీస్ కోటాను రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్నది. ట్రైబల్ ఏరియాలో రెండు ఏండ్లు లేదా రూరల్ ఏరియాలో 3 ఏండ్లు లేదా అర్బన్‌లో ఐదేండ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఎంబీబీఎస్ డాక్టర్లు.. ఇన్‌సర్వీస్ కోటాలో సీట్లు పొందడానికి అర్హులు. ‘నీట్’ పీజీ కూడా కచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా ఇన్‌సర్వీస్ కోటా సీట్లు భర్తీ చేస్తారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే ఇన్ సర్వీస్ కోటాకు అర్హులు. వీరికి మాత్రమే ఇన్‌సర్వీస్ కోటా సీట్లు కేటాయించాలి. కానీ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఈ నిబంధనను పట్టించుకోలేదు.
ALSO READ :- సిరిసిల్లలో సర్కార్ భూముల్లో వెంచర్.. 20.87ఎకరాల్లో లేఅవుట్ చేస్తున్న బల్దియా
కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న డాక్టర్లకు కూడా ఇన్‌సర్వీస్ కోటా సీట్లను కేటాయించింది. ఇందుకు సంబంధించి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఇన్‌సర్వీస్ కోటాలో గైనకాలజీ సీటు పొందిన కాంట్రాక్ట్ డాక్టర్ వివరాలను ఇన్‌సర్వీస్ డాక్టర్లు ఆదివారం ‘వెలుగు’కు అందజేశారు. కరీంనగర్ జిల్లాలోని ఓ పల్లె దవాఖానలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్న మహిళా డాక్టర్.. డీఎంహెచ్‌వో ఇచ్చిన కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికెట్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఇన్‌సర్వీస్ కోటాకు దరఖాస్తు చేసుకున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు.
అర్హత లేని వ్యక్తికి సీటు ఎట్లిస్తరు?
దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ప్రతి సర్టిఫికెట్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. విద్యార్హత, స్థానికత, క్యాస్ట్, సర్వీస్, తదితర సర్టిఫికెట్లను క్షుణ్నంగా పరిశీలించాకే ఎలిజిబుల్ కాండిడేట్స్‌తో మెరిట్ లిస్ట్ ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సీట్ల కేటాయింపు చేయాలి. తప్పుడు సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసిన వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ ఈ విషయంలో కాళోజీ హెల్త్ వర్సిటీ ఫెయిల్ అయింది. అసలు అర్హత లేని ఓ వ్యక్తి.. కేవలం 3 నెలలు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసి, ఈ మూడు నెలల సర్వీస్‌కు సంబంధించి డీఎంహెచ్‌వో ఓ సర్టిఫికెట్‌తో ఇన్‌సర్వీస్ కోటాకు దరఖాస్తు చేసుకుంది. వెరిఫికేషన్ సమయంలో ఈ విషయాన్ని గుర్తించి, చర్యలు తీసుకోకపోగా, ఆమెకు ఉస్మానియాలో సీటు కేటాయించారు. గాంధీలోనూ ఓ లేడీ డాక్టర్‌కు సీటు కేటాయించారని, ఆమె కూడా సర్వీస్‌లో లేదని మెడికోలు ఆరోపిస్తున్నారు. ఇలా ఇంకెంత మంది నకిలీ సర్టిఫికెట్లతో సీట్లు పొందారో తేల్చాలని డాక్టర్స్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. కాళోజీ వర్సిటీ అధికారుల కనుసన్నల్లోనే ఈ అవకతవకలు జరిగాయని ఇన్‌సర్వీస్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇన్ సర్వీస్ కేటగిరీలో సీట్లు పొందిన ప్రతి ఒక్కరి సర్టిఫికెట్లను వెరీఫై చేయాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంపై వివరణ కోరేందుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డికి ఫోన్ చేయగా, ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు.
ఆ సీటును క్యాన్సిల్ చేసిన వర్సిటీ
కాంట్రాక్ట్ కింద పని చేస్తున్న డాక్టర్.. సర్వీస్ చేయకుండానే ఇన్‌సర్వీస్ కోటాలో పొందిన పీజీ సీటును కాళోజీ హెల్త్ యూనివర్సిటీ క్యాన్సిల్ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వంలో సర్వీస్ చేయకుండానే, ఇన్‌సర్వీస్ కోటాలో పీజీ సీటు కోసం సదరు డాక్టర్ దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం సంబంధం లేని ఓ సర్టిఫికెట్‌ను ఇన్‌సర్వీస్ సర్టిఫికెట్‌గా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఈ విషయాన్ని కాళోజీ వర్సిటీ గుర్తించలేదు. సదరు డాక్టర్‌కు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఇన్‌సర్వీస్ కోటా కింద సీటు అలాట్ చేసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆదివారం రాత్రి పది గంటల తర్వాత ఆమె సీటు క్యాన్సిల్ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అది నా సీటు
ఉస్మానియాలో సీటు పొందిన డాక్టర్, నేను ఒకే కేటగిరీ (బీసీ–బీ ఫీమేల్). కాళోజీ వర్సిటీ నిర్లక్ష్యం వల్ల నాకు రావాల్సిన సీటు ఆమెకు వచ్చింది. ఆమె గవర్నమెంట్ సర్వీస్‌లో లేకపోయినా ఇన్‌సర్వీస్ కోటాలోకి తీసుకున్నారు. నాలుగు సంవత్సరాల గవర్నమెంట్ సర్వీస్‌తో నేను ఇన్ సర్వీస్ కోటాలో ఉన్నాను. నా కంటే నీట్ పీజీలో ఆమెకు ఎక్కువ ర్యాంక్ రావడం వల్ల ఇన్‌సర్వీస్ కోటా మెరిట్ లిస్ట్‌లో ఆమె నా కంటే ముందు ఉంది. ఆమె లేకపోయి ఉంటే ఆ సీటు నాకే వచ్చేది. ఇప్పుడు నాకు ప్రైవేటు మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఈ సీటు ఇంకెవరికో రావాల్సింది. ఇలా ఎంతో మందికి అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయాలని కోరుతున్నాం.