డీఈఈ సెట్ అడ్మిషన్లలో ఇష్టారాజ్యం

డీఈఈ సెట్ అడ్మిషన్లలో ఇష్టారాజ్యం
  • మెరిట్ ను పక్కన పెట్టి సీట్ల కేటాయింపు 
  • స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల తీరుపై విమర్శలు  

‘‘ఇబ్రహీంపట్నం శివారు గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని డీఈఈసెట్ లో 1400కు పైగా ర్యాంకు సాధించింది. తన నివాసానికి దగ్గరగా ఉండే రెండు ఇంగ్లిష్ మీడియం కాలేజీలను ఎంపిక చేసుకున్నది. వాటి లో ఆమెకు సీటు రాలేదు. దీంతో ఆయా కాలేజీల్లో సీట్ల కేటాయింపును పరిశీలించగా, తన కేటగిరిలోనే తన కంటే 500 ఎక్కువ ర్యాంకు ఉన్న వారికి సీట్లు అలాట్ అయ్యాయి..” ఇది కేవలం ఈ ఒక్క విద్యార్థి సమస్యనే కాదు.. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతోచాలామందికీ ఇలాంటి సమస్యనే ఎదురైంది. సెకండ్ ఫేజ్​లో మెరిట్ చూడకుండా, ముందుగానే కాలేజీల స్లైండింగ్ నిర్వహించడం వల్లే ఈ సమస్య ఎదురైంది. కానీ, ఇదంతా నిబంధనల ప్రకారమే అంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. 


హైదరాబాద్, వెలుగు:    డైట్ కాలేజీల్లోని డీపీఎస్ఈ, డీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం జులైలో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డీఈఈసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు15,150 మంది అటెండ్ కాగా, వారిలో12,032 మంది క్వాలిఫై అయ్యారు. కాలేజీలకు అఫిలియేషన్లు ఆలస్యంగా ఇవ్వడంతో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా నిర్వహించారు. అక్టోబర్ నెలాఖరులో ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ చేయగా, ఇటీవలే సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల అలాట్మెంట్ చేశారు. అయితే, అధికారులు చేపట్టిన అడ్మిషన్ల ప్రక్రియ తీరు గందరగోళంగా మారింది. ఫస్ట్ ఫేజ్ సీట్లను పూర్తిగా మెరిట్ ప్రకారం నిర్వహిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. సెకండ్ ఫేజ్ మాత్రం మెరిట్ తో సంబంధం లేకుండా కాలేజీల స్లైడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇతర విద్యార్థులకు అవకాశం ఇస్తున్నారు. 

దీనిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఈఏపీసెట్(ఎంసెట్), ఎడ్ సెట్, ఐసెట్, లాసెట్.. ఇలా ఏ ప్రవేశ పరీక్ష అయినా ముందుగా మూడు, నాలుగు విడతలు మెరిట్ ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంట్రా కాలేజీ స్లైడింగ్ కు అవకాశం ఇస్తారు. కాలేజీ నుంచి మరో కాలేజీకి మారేందుకు అవకాశమే ఉండదు. కానీ, డీఈఈసెట్ లో మాత్రం సెకండ్ ఫేజ్ లోనే మెరిట్ ను పక్కనపెట్టి ముందుగా కాలేజీల స్లైడింగ్ నిర్వహిస్తున్నారు. 

అంటే ఫస్ట్ ఫేజ్​లో ఏదైనా ఓ కాలేజీలో సీటు వస్తే.. వారికి సెకండ్ ఫేజ్​లో ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాతే ఇతరులకు సీట్లు ఇస్తారు. ఇది ఒకే విడతగా అధికారులు ప్రకటిస్తున్నారు. కనీసం స్టూడెంట్లు, పేరెంట్స్ కు కాలేజీల ఇంట్రా స్లైడింగ్ అనే విషయమే చెప్పకుండా సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అంటూ ప్రకటన చేస్తున్నారు. దీంతో చాలామంది మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని విద్యార్థులు, పేరెంట్స్ వాపోతున్నారు.  ఇలాంటి కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేసి ఇతర కోర్సుల్లో మాదిరిగా ప్రవేశాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై డీఈఈసెట్ అధికారులను వివరణ కోరగా.. నిబంధనల ప్రకారమే అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్తున్నారు.