మహబూబ్‌నగర్, వెలుగు : మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్ నాయకులు వందలాది డబుల్ బెడ్‌రూం ఇండ్లను అక్రమంగా కేటాయించుకొని, తర్వాత వాటిని అమ్ముకున్నారని ఆఫీసర్లకు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ ఆఫీసర్లు ఫీల్డ్ ఎంక్వైరీ చేపట్టడంతో అక్రమాలు నిజమేనని తేలింది. దీంతో ఫైనల్ ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.
అనర్హులు, స్థానికేతరులకు కేటాయింపు
పాలమూరు మున్సిపాలిటీలోని దివిటిపల్లిలో 1,024, వీరన్నపేటలో 660, క్రిస్టియన్‌పల్లిలో 310 డబుల్ బెడ్‌రూం ఇండ్ల చొప్పున మొత్తం 1,994 ఇండ్లు కట్టారు. పూర్తి అయిన ఇండ్లను డ్రా ద్వారా అర్హులకు కేటాయించాల్సి ఉండగా.. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ లీడర్, ఆయన అనుచరులు, ప్రస్తుతం ఉన్న మున్సిపల్ పాలకవర్గ సభ్యుల్లోని కొందరు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. మొదట్లో కొన్ని ఇండ్లకు డ్రా తీసి అర్హులకు కేటాయించారు. ఆ తర్వాత ఒక్కో ఇంటిని రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల చొప్పున వందలాది ఇండ్లు అమ్ముకున్నారు. ఇలా ఇండ్లు పొందిన వారిలో ప్రభుత్వ, ప్రైవేట్, రిటైర్డ్ ఉద్యోగులు సైతం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు బీఆర్‌ఎస్ లీడర్లు కూడా ఇండ్లు తీసుకోవడంతో పాటు కరీంనగర్, కర్నాటక, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న బంధువులకు సైతం ఇప్పించినట్లు తెలిసింది. ఇండ్లు కొనుక్కున్న వ్యక్తులు తర్వాత రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలకు అమ్మేసినట్లు సమాచారం. ఆ డబుల్ బెడ్‌రూం ఇండ్లను కొనుక్కున్న వారు ఇంటీరియర్ డెకరేషన్, పీవోపీ, ఎలివేషన్ పనులు చేయిస్తున్నారు.
850 ఇండ్లు అనర్హులకే..
డబుల్ బెడ్‌రూం ఇండ్లను అనర్హులకు కేటాయించారని తెలియడంతో ప్రజలు గతంలో కలెక్టర్లను కలవడంతో పాటు గ్రీవెన్స్‌లో సైతం ఫిర్యాదు చేశారు. రెండేండ్ల పాటు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుబ్ బెడ్‌రూం ఇండ్ల అవకతవకలపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టాలని జనవరిలో రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు. పది రోజుల పాటు ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు.. లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలు, వారు ఇండ్లల్లో ఉన్నారా ? లేదా ? ఇతరులకు రెంట్‌కు ఇచ్చారా ? అనర్హులకు ఇండ్లు దక్కాయా ? అనే వివరాలు సేకరించారు.
డబుల్ ఇండ్ల కేటాయింపులో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మొత్తం 1,994 ఇండ్లల్లో 850కి పైచిలుకు ఇండ్లు అనర్హులకే దక్కాయని తేలింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ఫైనల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం నుంచి ఇంటింటికీ తిరిగి విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం 15 మంది ఆఫీసర్లను నియమించారు. వీరు మరోసారి విచారణ జరిపి ఫైనల్ రిపోర్ట్‌ను రెడీ చేయనున్నారు. అందులోనూ అనర్హులని తేలితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు.