- నాన్‌లోకల్ వాళ్లకు ఇవ్వడంపై అనుమానాలు
- రూ. లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు
- రోడ్డు, ఫేసింగ్ పేరిట నిర్వాసితుల వద్ద కూడా డబ్బులు వసూలు
- నాగర్ దొడ్డి‘ఆర్‌అండ్‌ఆర్’ కమిటీ నిర్వాకం
గద్వాల, వెలుగు: జూరాల బ్యాక్‌వాటర్‌లో ముంపునకు గురవుతున్న ధరూర్ మండలం నాగర్‌దొడ్డి గ్రామానికి సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్ ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయి. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు కాకుండా నాన్‌లోకల్ వాళ్లకు ప్లాట్లు కేటాయించారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇందుకోసం అధికారులు, గ్రామ పెద్దలు ప్లాటుకు లక్ష తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. నిర్వాసితులకు ఇచ్చిన ప్లాట్లలోనూ రోడ్డు, మంచి పేసింగ్ ఉన్న వాటికి డబ్బులు వసూలు చేశారని అంటున్నారు.
325 మంది నిర్వాసితులు
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నాగర్ దొడ్డి గ్రామంలో 2007 ఒకసారి, 2017లో ఇంకోసారి సమగ్ర ఆర్థిక సర్వే చేశారు. దీని ప్రకారం గ్రామంలో 325 మంది నిర్వాసితులకు గుర్తించి.. వారందరికీ ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామ సమీపంలో 26 ఎకరాల స్థలాన్ని సేకరించి.. 285 ప్లాట్లు చేశారు. అనంతరం ఆర్డీవో, సర్పంచ్, గ్రామ పెద్దలతో కమిటీ వేసి డిప్ సిస్టం ద్వారా ప్లాట్లు కేటాయించాలని తీర్మానించారు. కానీ, లాటరీ తీయకుండానే ఇష్టం వచ్చిన వారికి ప్లాట్లు ఇచ్చారు. రోడ్ సైడ్ బిట్టు, మంచి ఫేసింగ్ ఉన్న ప్లాట్ కోరిన వారి నుంచి రూ. 20 వేల వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
35 మంది నాన్‌లోకల్‌కు..
సమగ్ర ఎకనామికల్ సర్వేలో పేర్లు లేని వారికి కూడా ప్లాట్లు కేటాయించారు. దాదాపు 35 మంది నాన్ లోకల్ వారికి ప్లాట్లు ఇచ్చి ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష తీసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో ఉన్న ప్లాట్ల సైజులను తగ్గించి ఇవ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ముందు ప్రతి ప్లాటు 60/40 ఫీట్లు (240 గజాలు)గా ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఇస్తున్న ప్లాట్ల సైజును 56/35 ఫీట్లకు(196 గజాలు) తగ్గించారు. అంటే 285 ఉన్న ప్లాట్లు 292కు పెంచి.. ఇష్టం వచ్చిన వాళ్లు ఇచ్చారు.
2017 తర్వాత 18 ఏళ్లు నిండిన వారి పరిస్థితి ఏంటి?
నాగర్ దొడ్డి ఆర్‌అండ్‌ఆర్ సమస్య 2007 నుంచి కొనసాగుతోంది. నెమ్మదిగా ప్రాసెస్ సాగడంతో 2017లో కొలిక్కి వచ్చింది. అప్పటివరకు 18 ఏండ్లు నిండిన 385 మందిని అర్హులకు గుర్తించారు. 285 ప్లాట్లు ఏర్పాటు చేసినా.. 35 మంది వరకు నాన్‌లోకల్ వాళ్లకు కేటాయించడంతో ఇంకా 70 మంది వరకు ప్లాట్లు రాలేదు. ఇదిలా ఉండగా గ్రామంలో 2017 తర్వాత 18 ఏండ్లు నిండిన వారు 60 మంది వరకు ఉన్నారు. వీళ్ల పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మిగిలిపోయిన వారితో పాటు వీళ్లకు ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాన్‌లోకల్ వారిని తొలగిస్తే ఇదేమీ కష్టం కాదని చెబుతున్నారు.
ఎంక్వైరీ చేస్తాం
ఆర్ఆర్ సెంటర్‌లో ప్లాట్ల కేటాయింపు పారదర్శకంగా చేస్తున్నం. గ్రామ సభ ఏర్పాటు చేసి నిర్వాసితుల సమక్షంలోనే ప్లాట్లు ఇస్తున్నం. ఇంజనీర్లు ఇచ్చిన స్టాండర్డ్ సైజు ప్రకారమే పాట్లు ఏర్పాటు చేసినం. నిర్వాసితుల నుంచి డబ్బులు వసూలు చేసిన విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేస్తం.
- రాములు, ఆర్డీవో గద్వాల
వేరేఊరోళ్లకు ప్లాట్లు ఇచ్చిన్రు
ఊర్లో ఉన్న వాళ్లకి కాకుండా 35 మంది వేరే ఊరోళ్లకు ఇచ్చిన్రు. ఇదేమని అడిగితే సప్పుడు జేస్తలేరు. ఊర్ల కూడా పైసలు ఇచ్చినోళ్లకే మంచి ప్లాట్లు ఇచ్చిన్రు. లేకుంటే ఎక్కడ్నో లోపల ఉండే ప్లాట్లను అంటగట్టిన్రు. ఇంకా చానా మందికి ప్లాట్లు రాలే.
- రాధాకృష్ణ, నిర్వాసితుడు, నాగర్ దొడ్డి