
- యాజమాన్యంపై ఈసీ యాక్ట్ కింద కేసు
- కేసును నీరుగార్చేందుకు మొదలైన రాజకీయ ఒత్తిళ్లు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ ధాన్యంలో అక్రమాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, రైస్ మిల్లర్ల సిండికేట్ ఆధిపత్యానికి తోడు రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంగా రూ.వందల కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమవుతోంది. తాజాగా కుంటాల మండలం అర్లి గ్రామం వద్ద ఉన్న శ్రీ ద్వారకామయి ఆగ్రో ఇండస్ట్రీస్ కు ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్ ధాన్యంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఏకంగా రూ.48 కోట్ల విలువైన 16,427 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారుల విచారణలో నిర్ధారణ అయ్యింది.
16,427 మెట్రిక్ టన్నుల ధాన్యం
జిల్లాలోని రైస్‌మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ధాన్యంలో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే తనిఖీలు చేసిన అధికారులు 15 రైస్ మిల్లులపై కేసులు నమోదు చేశారు. అర్లి వద్ద ఉన్న శ్రీ ద్వారకామయి ఆగ్రో ఇండస్ట్రీస్‌లో 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం మూడు సీజన్లకు సంబంధించి రూ.48 కోట్ల విలువైన 16,427 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో యజమాని రుక్మిణిపై ఏ1గా, ఆమె భర్త వెంకటేశ్‌పై ఏ2గా ఎసెన్షియల్ కమోడిటీ(ఈ సీ) యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. వీరిద్దరిపై చీటింగ్ కేసు కూడా నమోదైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
రక్షించేందుకు ఓ మాజీ ప్రజా ప్రతినిధి ప్రయత్నాలు
శ్రీ ద్వారకామయి ఆగ్రో ఇండస్ట్రీస్ 2022–2023 యాసంగి సీజన్లో 9040.160 మెట్రిక్ టన్నులు, 2023–2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 2309.960 మెట్రిక్ టన్నులు, యాసంగిలో 4,996 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాయం చేసినట్లు గుర్తించారు. అయితే ఈ మిల్లు యజమానులకు పెద్ద ఎత్తున రాజకీయ అండదండలు ఉన్నాయని, వారిని రక్షించేందుకు ఓ మాజీ ప్రజా ప్రతినిధి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారిని కేసు నుంచి తప్పించేందుకు మూడు రోజుల నుంచి సదరు మాజీ ప్రజాప్రతినిధి అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం.
ఇప్పటికే 15 మిల్లులపై కేసులు
జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల యాజమాన్యాలు సిండికేటుగా ఏర్పడి రాజకీయ అండదండలతో ప్రతి సీజన్ కు సంబంధించి సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. దీంతో సంబంధిత అధికారులు కలెక్టర్ నేతృత్వంలో పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. విచారణలో దాదాపు 15 రైస్ మిల్లుల యాజమా న్యాలు సీఎంఆర్ ధాన్యంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఈ మిల్లుల యజమానులపైకేసులు నమోదు చేశారు. ఈ 15 మిల్లులు పెనాల్టీతో కలుపుకొని రూ.153 కోట్ల విలువైన 48,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని స్వాహా చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
మిల్లర్లకు వరంగా మారుతున్న గడువు పెంపు
ప్రభుత్వం సీఎంఆర్ ధాన్యం మిల్లింగ్ వ్యవహారంలో ప్రతి సీజన్‌కు గడువు పెంచుతుండడం రైస్ మిల్లర్లకు వరంగా మారుతోంది. రాజకీయ అండదండలతో సంబంధిత అధికారులపై ఒత్తిళ్లు పెంచుతూ ఏటా వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా యాసంగి సీజన్ వచ్చేవరకు ఆ ధాన్యాన్ని నిల్వ ఉంచి.. ఆ ధాన్యంతో తప్పుడు రికార్డులు సృష్టించి అధికారులను పక్కదోవ పట్టిస్తున్నారు. ఇలా ప్రతి సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని కొంత మేర మిల్లింగ్ చేసి మరి కొంత పక్కదోవ పట్టిస్తూ కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేస్తున్నారు.