- మొదట వేసిన టెండర్ క్యాన్సిల్ చేసిన అధికారులు
- రీటెండర్లు పిలవడంపై అనుమానాలు
- తక్కువ కోట్ చేసిన కంపెనీ సీఎంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు
- కమీషన్ల కోసమే మొదటి టెండర్లు రద్దు చేశారనే ఆరోపణలు
- కాకతీయ యూనివర్సిటీ అధికారుల తీరుపై విమర్శలు
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల జవాబు పత్రాల ఆన్ స్క్రీన్ వాల్యూయేషన్ కోసం పరీక్షల విభాగం కంట్రోలర్ పిలిచిన ఈ-టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మొదటిసారి వేసిన టెండర్ కాన్సిల్ చేసి, రెండోసారి అదే పనికి నోటిఫికేషన్ జారీ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము అనుకున్న కంపెనీకి స్కానింగ్ పనులు అప్పగించడం కోసమే తక్కువ కోట్ చేసిన కంపెనీని పక్కన పెట్టి కొత్తగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ సహా రిజిస్ట్రార్, వీసీలకు ఈ టెండర్ వ్యవహారంలో భాగం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తక్కువ కోట్ చేసినా టెండర్ రద్దు
కాకతీయ యూనివర్సిటీ ఈ- ప్రొక్యూర్ మెంట్ కమిటీ చైర్మన్, పరీక్షల విభాగం కంట్రోలర్ ఈ జవాబు పత్రాల ఆన్ స్క్రీన్ వాల్యూయేషన్ కోసం ఫిబ్రవరి 22న తెలంగాణ ఈ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ టెండర్ లో 32 పేజీల యూజీ, పీజీ పరీక్షలకు చెందిన ఆన్సర్ షీట్లను ఆన్-స్క్రీన్ వాల్యూయేషన్, డిజిటలైజేషన్ చేయాలని పేర్కొన్నారు.
రూ.2 కోట్ల విలువైన ఈ-టెండర్ అగ్రిమెంట్ కాల పరిమితిని ఐదేళ్లుగా నిర్ణయించారు. మూడు కంపెనీలు టెండర్ దాఖలు చేయగా.. అందులో కోజిన్ లిమిటెడ్ మిగతా రెండు సంస్థల కంటే తక్కువ రేటుకే కోట్ చేశారు. ఒక సంస్థ రూ.27.13, మరో సంస్థ రూ.15 కు టెండర్ దాఖలు చేయగా.. కొజిన్ సంస్థ మాత్రం ఒక ఆన్సర్ షీట్ డిజిటలైజేషన్ కు రూ.14.51 గా కోట్ చేసింది. కానీ వారికి టెండర్ ఖరారు చేయలేదు. ఆ టెండర్ ను రద్దు చేసి మళ్లీ రెండోసారి టెండర్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడంతో వివాదం మొదలైంది.
సీఎం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు
మార్చి 16న యూనివర్సిటీ అధికారులు రెండో సారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో సరైన కారణాలు చూపకుండా టెండర్ ను రద్దు చేసి, మళ్లీ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంపై కొజిన్ సంస్థ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫస్ట్ టెండర్ ఎందుకు రద్దు చేశారో సరైన కారణాలు చెప్పలేదని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోజిన్ లిమిటెడ్ ప్రతినిధులు ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
తమ బిడ్ మొదటి స్థానంలో ఉందని, తమకు ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్న సమయంలో టెండర్ రద్దు చేశారని పేర్కొన్నారు. అయితే టెండర్లు దాఖాలు చేసేందుకు చివరి తేది మార్చి 20గా పేర్కొన్నారు. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే టెండరు దరఖాస్తుదారులకు సమయం ఇవ్వడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టెండర్ నోటిఫికేషన్ లోనే నిబంధనలకు నీళ్లు!
నిబంధనల ప్రకారం టెండర్ కాల పరిమితి కేవలం ఒక ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పనితీరును చూసి కాల పరిమితి పెంచాలి. కానీ ఒకేసారి ఐదేళ్ల కాల పరిమితి పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ.2 కోట్ల విలువైన టెండరు పనులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాలంటే పూర్తి కోరం కలిగిన యూనివర్సిటీ పాలక మండలి తీర్మానం తప్పనిసరి.
కాగా పూర్తి కోరం పాలక మండలి అనుమతి లేకుండా, కేవలం ముగ్గురు సభ్యుల ఆమోదంతోనే టెండర్ కు వెళ్లారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీసీ పదవీ కాలం రెండు నెలల్లో పూర్తవుతుందన్న సమయంలో టెండర్ల విషయంలో వివాదం తలెత్తడంతో కమీషన్ల కోసమే రీ టెండర్లు పిలిచారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాకతీయ యూనివర్సిటీలో తరచూ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.
చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు సైలెంట్ గా ఉండిపోతున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి వీసీ రమేశ్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు కమిటీ వేసేందుకు వేయాలని నిర్ణయించినా.. ఓ ఆఫీసర్ అప్రూవల్ ఇవ్వడం లేదని సమాచారం. అంతేగాకుండా పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలు, స్టూడెంట్లను పోలీసులతో కొట్టించిన వీసీ అరాచకాలపై విద్యార్థులు ఉద్యమిస్తే, ఆ ఉద్యమాన్ని అప్పటి ప్రతిపక్ష నాయకులు వాడుకున్నారని, తీరా ఇప్పుడు ప్రభుత్వం మారినా సదరు వీసీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
శాతవాహనలోనూ ఇదే తీరు
సాధారణంగా ప్రభుత్వంలోని ఏ విభాగంలోనైనా రూ.5 లక్షలలోపు పనులకు మాత్రమే నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించాల్సి ఉంటుంది. ఆ పరిధి దాటితే టెండర్ కు వెళ్లాలి. కానీ కోట్లాది రూపాయల విలువైన ఆన్సర్ షీట్ల స్కానింగ్ పనులను ఎలాంటి టెండర్ లేకుండా తమకు నచ్చిన కంపెనీకి నామినేషన్ పద్ధతిలో అప్పగించిన వ్యవహారం ఇటీవల శాతవాహన యూనివర్సిటీలోనూ వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై 'వీ6 వెలుగు' కథనాలు ప్రచురించగా ఉన్నత విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలోనూ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం తీవ్ర చర్చనీయాంశమైంది.
కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లే రద్దు
ఇదివరకు కేవలం పీజీ కోర్సులు మాత్రమే ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని కోర్సులు చేస్తున్నాం. ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ టెండర్ల ప్రక్రియలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తాయి. అందుకే టెండర్లు రద్దు చేయాల్సి వచ్చింది. టెండర్ ప్రక్రియలో కొన్ని కరెక్షన్స్ చేసి, రీ టెండర్లు పిలిచాం. అందులో తక్కువ కోట్ చేసి, అర్హత కలిగిన వారికి మాత్రమే పనులు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటాం.
ప్రొఫెసర్ ఎస్.నరసింహచారి, కేయూ ఎగ్జామ్స్ కంట్రోలర్