ఎంప్లాయీమెంట్ ఆఫీసులో అక్రమాలు

  • కలెక్టర్ అప్రూవల్ లేకుండానే రెన్యువల్​
  • ఒక్కో ఏజెన్సీ నుంచి భారీగా వసూళ్లు  
  • బయటపడ్డ అధికారి బాగోతం 
  • ఆఫీసర్ పై కలెక్టర్ ఆగ్రహం 

సూర్యాపేట, వెలుగు :  ఎంప్లాయీమెంట్ ఆఫీసులో అక్రమాలు బయటపడ్డాయి. కలెక్టర్ అప్రూవల్ లేకుండానే ఎంప్లాయీమెంట్ ఆఫీసర్.. అవుట్ సోర్సింగ్ మ్యాన్ పవర్ సప్లయ్ ఏజెన్సీలను రెన్యువల్ చేశారు. ఇందుకోసం ఏజెన్సీల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు బయటపడింది. దీనిపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ విచారణ చేపట్టి ఎంప్లాయీమెంట్ ఆఫీసర్ ను కమిషనర్ ఆఫీస్ కు సరెండర్ చేస్తూ ఆర్డర్స్ జారీ చేశారు.  

కలెక్టర్ అప్రూవల్ లేకుండానే రెన్యువల్..

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల కోసం అర్హత కలిగిన ఏజెన్సీలను మ్యాన్ పవర్ అందించేందుకు ఎమ్ ప్యానెల్ లో రిజిస్ట్రార్ చేయాల్సి ఉంటుంది. ఎమ్ ప్యానెల్​మెంట్​ఆధారంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు కాంట్రాక్ట్ లను ప్రభుత్వం అప్పగిస్తుంది. అగ్రిమెంట్ చేసుకున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎమ్ ప్యానెల్​మెంట్​ కమిటీ చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా ఎంప్లాయీమెంట్ ఆఫీసర్ వ్యవహరిస్తారు. సూర్యాపేట జిల్లాలో 36 ఏజెన్సీలు ఉన్నాయి. 

గత మార్చిలో ఏజెన్సీల వ్యాలిడిటీ ముగిసింది. వరుస ఎన్నికలతో ఈ ఏడాది ఏజెన్సీ లను రెన్యువల్ చేయకుండా గడువు జూలై 31 వరకు పొడిగించారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వ్యాలిడిటీ ముగియడంతో రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎమ్ ప్యానెల్​మెంట్​కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత కలెక్టర్ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎంప్లాయీమెంట్ ఆఫీసర్ అక్బర్ హబీబ్ కమిటీ అప్రూవల్ లేకుండానే నేరుగా ఏజెన్సీలను రెన్యువల్ చేశారు. 

కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో బయటపడ్డ బాగోతం..

సదరు ఆఫీసర్ ఏజెన్సీలను రెన్యువల్ చేయడంతో కొంతమంది నిర్వాహకులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని ఏజెన్సీలు పనిచేయకపోయినా వాటిని కూడా రెన్యువల్ చేశారు. సురక్ష ఏజెన్సీ, వినాయక ఏజెన్సీ, ఎమ్ జీఆర్ తోపాటు మరో 15 ఏజెన్సీలను సైతం రెన్యువల్ చేశారు. 

ఈ ఏజెన్సీల నుంచి ఎంప్లాయిమెంట్​ ఆఫీసర్​ డబ్బులు తీసుకున్నట్టు కొందరు ఏజెన్సీల నిర్వాహకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఎంప్లాయీమెంట్ ఆఫీసర్ పై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీలకు సంబంధించిన ఫైల్స్ ను పరిశీలించిన అనంతరం ఆఫీసర్ పై చర్యలు చేపట్టారు. 

ఆఫీసర్ పై అనేక ఆరోపణలు.. 

ఎంప్లాయీమెంట్ ఆఫీసర్ అక్బర్ హబీబ్ పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా ఏజెన్సీ పర్మిషన్స్ ఇవ్వాలన్నా.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావాలన్నా.. లక్షల్లో డబ్బులు వసూళ్లు చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అర్హతలేని వాటికి సైతం ముడుపులు తీసుకొని రెన్యువల్ చేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. 

కలెక్టర్ సదరు అధికారి ఫోన్ పే లావాదేవీలను తనిఖీ చేసినట్లు సమాచారం. దీనితో ఆయనపై చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇంకా లోతుగా విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడుతాయని కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.