హెచ్ఎండీఏ పర్మిషన్లలో అవకతవకలు.. కేసులున్నా లే-అవుట్లకు అప్రూవల్స్

  • సీఎం పేరు చెబుతూ రంగంలోకి దళారుల ముఠా 

హైదరాబాద్, వెలుగు:హెచ్ఎండీఏ అనుమతుల్లో అవకవతకలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాష్ట్ర సర్కార్​కు దగ్గరగా ఉండే కొంతమంది సీఎం, సీఎం కుటుంబసభ్యుల పేర్లు చెప్పి వ్యవహరం చక్కబెడుతున్నట్లు తెలిసింది. మున్సిపల్ శాఖ సీఎం దగ్గరే ఉండటంతో సార్ చెప్పారంటూ అధికారులతో కలిసి పని కానిచ్చేస్తున్నారు. హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నవాటిని, ఇతర వివాదాలు ఉన్న భూములకు సైతం లే అవుట్, బిల్డింగ్ పర్మిషన్లు ఇస్తున్నట్లు తెలిసింది. ఇటీవల సంగారెడ్డి జిల్లా పరిధిలో పలు లే అవుట్లకు కేసులున్నా పర్మిషన్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

అక్రమ పర్మిషన్లను తిరిగి క్యాన్సిల్ చేసే విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ఒకటి, రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఏదైనా సంస్థ వెంచర్‌‌ ఏర్పాటు చేస్తే నిబంధనల మేరకు అన్ని క్లియరెన్స్‌‌ లు ఉన్నాయా లేదా చూసుకొని నిర్దేశిత ఫీజు చెల్లించిన తర్వాత ఆ శాఖ ఉన్నతాధికారి అప్రూవల్‌‌ ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మొత్తంగా మారిపోయింది. అలాంటి వెంచర్‌‌లకు క్లియరెన్స్‌‌ ఇవ్వాలన్నా తమ అనుమతి తీసుకోవాలని సదరు దళారులు చెప్పుకుంటున్నారు. తమకు చెప్పకుండా ఏ ఒక్క ఉన్నతాధికారి కూడా అలాంటి అనుమతులు ఇవ్వడానికి వీల్లేదని వాళ్లు చెప్పుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.