900 యూరియా బస్తాలు మాయం.. విచారణలో వాస్తవాలు

900 యూరియా బస్తాలు మాయం.. విచారణలో వాస్తవాలు

కరీంనగర్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇతర కో ఆపరేటివ్ సొసైటీల్లో తరుచూ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రయివేటు వ్యక్తులను ఆడిట్ బాధ్యతలను అప్పగించడం వల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు తెలుస్తోంది. దుర్శేడు ప్రాథమిక సహకార సంఘంలో 900 యూరియా బస్తాలు మాయమయ్యాయి. దీనిపై విచారణ చేస్తుండగా మరిన్ని విషయాలు బయటకొచ్చాయి. 

కరీంనగర్ జిల్లా దుర్శేడ్ ప్రాథమిక సహకార సంఘం వరుస అక్రమాలకు కేంద్రంగా మారింది. గతంలో 706 ఎరువుల బస్తాల మిస్సింగ్ వ్యవహారంపై అధికారుల విచారణ పూర్తయినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. మరోసారి 900 యూరియా బస్తాలు మాయమవడం చర్చనీయాంశంగా మారింది. యూరియా బస్తాల లెక్క తేడా ఉండటంతో నెల రోజులుగా సహకార శాఖ అధికారులు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఎరువులకు సంబంధించిన స్టాక్, సేల్స్ రికార్డులను తనిఖీ చేయగా యూరియా బస్తాల్లో తేడా వచ్చినట్లు తెలుస్తోంది. 

గతేడాది ఆగస్టులో మార్క్ ఫెడ్ పంపించిన 900 యూరియా బస్తాలను సింగిల్ విండో గోదాంలో అన్ లోడింగ్ చేశారు.వీటికి సంబంధించిన వివరాలు స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయకపోవడాన్ని తనిఖీల్లో అధికారులు గుర్తించారు. 900 యూరియా బస్తాలు సంఘానికి పంపించినట్లు మార్క్ ఫెడ్ ఇన్వాయిస్ ఉండగా, స్టాక్ రిజిస్టర్లో నమోదు కాలేదని దుర్శేడ్ సహకార సంఘం డైరెక్టర్లు అంటున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. 

గతేడాది  అక్టోబర్ లో ఇదే తరహాలో 706 ఎరువుల బస్తాలు మాయమయ్యాయి. దీనిపై డైరెక్టర్లు ఫిర్యాదు చేయడంతో సహకార అధికారులు విచారణ చేశారు. ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. గతేడాది డిసెంబర్లో 33 లక్షల విలువైన 1,692 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలులోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేసిన అధికారులు, రాజకీయ ఒత్తిళ్లతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారన్న  విమర్శలు వస్తున్నాయి.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏటా కోట్లాది రూపాయల లావాదేవీలు జరుపుతుంటాయి. లక్షల రూపాయల ఎరువుల వ్యాపారం చేస్తుంటాయి. ధాన్యం కొనుగోళ్లు చేసి రైతులకు సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కలన్నిoటిని సంబంధిత సహకార శాఖ అధికారులకు ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పనిని రిటైర్డ్ అయిన వారికి అప్పజెప్పడంతో తప్పులు దొర్లుతున్నట్లు తెలుస్తోంది.  

రిటైర్డ్ అయిన మహిళా అధికారిణి భర్త ఆడిటింగ్ రిపోర్ట్

ప్రాథమిక సహకార సంఘాలకు, కో ఆపరేటివ్ సంస్థలకు సంబంధించిన లావాదేవీలను ప్రతి రోజు..  ఇంటెల్ ఏక్ట్ సాఫ్ట్ వేర్ ద్వారా ఉద్యోగులు నమోదు చేస్తారు. ఈ సైట్ ఓపెన్ చేసే అధికారం జిల్లా సహకార బ్యాంక్ అధికారులకే ఉంటుంది. రిటైర్డ్ అధికారులు ఈసైట్ వివరాలను ఇక్కడికెళ్లి తీసుకెళ్లి ఆడిట్ పూర్తి చేసి తిరిగి అసలు అధికారులకు ఇస్తుంటారు. ఇందులో తప్పులున్నా.. అసలు ఆడిటర్ బాధ్యుడు అవుతాడు.  దుర్శేడు  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఆడిట్ చేయాల్సిన అధికారిణికి బదులు.. గతంలో ఆడిటర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆ మహిళా అధికారిణి భర్త ఆడిటింగ్ రిపోర్ట్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని సంస్థ డైరెక్టర్లు ప్రశ్నించడంతో యూరియా మాయమైన అంశం బయటకొచ్చింది.

మానకొండూరు మండలంలోని..

మానకొండూరు మండలంలోని గట్టుదుద్దెన పల్లి సహకార సంఘం ఒకప్పుడు ఉత్తమ సొసైటీల్లో ఒకటి. ఇందులో మూడేళ్ల క్రితం 4 కోట్ల రూపాయల పైగా నిధులు పక్కదారి పట్టినట్లు ఆడిట్ లో తేలింది. దీంతో అప్పటి సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేశారు. ఇప్పటికీ ఆక్కడ జరుగుతున్న అనేక వ్యవహారలపై సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ ఖర్చులు, రాబడి వ్యవహారాలపై నిఘా పెట్టాలంటున్నారు. ఇక సొసైటీల్లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి.. నిందితులపై చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.