- కమర్షియల్ ట్యాక్స్ సహా మూడు శాఖల్లో చక్రం తిప్పిన మాజీ సీఎస్సోమేశ్
- సాఫ్ట్వేర్లలో మార్పులు చేసి అవకతవకలు
- ధరణి పోర్టల్‌లోని లోపాలు అవకాశంగా తీసుకుని విలువైన భూములు తారుమారు
- ఎక్సైజ్ శాఖలో లేబులింగ్ ప్రక్రియ, ఎక్సైజ్ డ్యూటీలోనూ ఇష్టారాజ్యం
- సోమేశ్‌కు నాటి బీఆర్ఎస్ పెద్దల అండదండలు
- ఆయన వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు
హైదరాబాద్, వెలుగు: నాటి బీఆర్ఎస్ సర్కార్ అండదండలతో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖలో జీఎస్టీ పన్ను ఎగవేతలు, తప్పుడు ఇన్వాయిస్లతో పలువురితో కలిసి వందల కోట్లు కొల్లగొట్టిన కేసులో సోమేశ్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన లీలలు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కే పరిమితం కాలేదని రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల్లోనూ కావాల్సిన వాళ్లకు వేల కోట్లు దోచిపెట్టారని ప్రభుత్వ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ 3 శాఖల్లోనూ సాఫ్ట్వేర్ మార్పుల పేరుతోనే అక్రమాలకు ఊతమిచ్చారని సోమేశ్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీఎస్‌గా ఉన్న టైమ్‌లో ఆయన ఏయే శాఖలు చూశారు? ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు? వాటి వల్ల ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరింది? అనే దానిపై ప్రభుత్వం వివరాలు తెప్పించుకుంటున్నది.
అప్పట్లో కీలక శాఖలన్నీ సోమేశ్‌కే..
సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్‌కు కీలకమైన సీసీఎల్ఏ అప్పగించారు. రెవెన్యూ స్పెషల్ సీఎస్‌గా, ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌గా, కమర్షియల్ ట్యాక్స్ స్పెషల్ సీఎస్‌గా బాధ్యతలు అప్పగించారు. కమర్షియల్ ట్యాక్స్డిపార్ట్మెంట్లో కొత్త సాఫ్ట్వేర్ తెచ్చిన ఆయన.. అందులోని లోపాల ఆధారంగా నకిలీ ఇన్వాయిస్లతో రూ.వెయ్యి కోట్లు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది.
ధరణి పోర్టల్లోనూ సోమేశ్ తెచ్చిన కొత్త సాఫ్ట్ వేర్ ద్వారా బీఆర్ఎస్ పెద్దలు, పలువురు ఐఏఎస్‌లు రూ.వేల కోట్ల విలువైన భూములను కాజేశారనే ఆరోపణలొచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇందుకు సంబంధించి పలు ఆధారాలూ బయటకొచ్చాయి. ఎక్సైజ్ శాఖలో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ దిగుమతికి సంబంధించి, డిస్టిలరీల నుంచి వైన్స్‌లు, బార్లకు మద్యం సరఫరా అయ్యే దాంట్లోనూ పకడ్బందీ సిస్టమ్ తేవాలని చెప్పినా సోమేశ్ ఒప్పుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.
మద్యం డిపోల నుంచి వైన్స్‌లకు వెళ్లాల్సిన లిక్కర్‌ను రెండేళ్లపాటు పక్కదారి పట్టించారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అప్పట్లో చర్చ జరిగింది. ఈ వ్యవహరాలన్నీ నాటి ప్రభుత్వ పెద్దల అండతోనే జరిగాయని, దీంతోనే సోమేశ్‌కు సీఎం ముఖ్య సలహాదారు పోస్టు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
ధరణి పోర్టల్ బాధ్యతల వెనుక సోమేశ్ హస్తం..
ధరణి పోర్టల్బాధ్యతలను ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించేందుకు అప్పటి సీసీఎల్ఏ సోమేశ్ కుమార్చక్రం తిప్పారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. పోర్టల్ బాధ్యతలు ఇవ్వడమే కాకుండా.. అందులో ఉన్న భూముల వివరాల్లో మార్పులు చేసేలా, వాటిని ఎలా చేశారనే దానికి ఆధారాల్లేకుండా రికార్డులు మాయం చేసేలా అపరిమిత అధికారం కట్టబెట్టినట్టు నిర్ధారించింది. సీసీఎల్ఏ ఆఫీసులోని ఉండాల్సిన లాగిన్ ఐడీలు సైతం.. టీఎస్టీఎస్కు అప్పగించడం వెనుక చాలా తతంగం జరిగినట్టు ప్రభుత్వం భావిస్తున్నది.
అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలకు కొన్ని పనులు చక్కపెట్టడంతో సోమేశ్ కుమార్ ఏం చేసినా ‘ఓకే గో హెడ్’ అనేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్న కొన్ని బడా కంపెనీలకు లిటిగేషన్లో ఉన్న ల్యాండ్స్‌ను పోర్టల్‌లో ఈజీగా మార్పులు చేసి అప్పగించినట్టు తెలుస్తున్నది. ఇందులో వేల కోట్లు చేతులు మారినట్టు ప్రాథమికంగా గుర్తించారు. భూరికార్డుల ప్రక్షాళన కోసం ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్మేనేజ్ మెంట్ సిస్టం (ఐఎల్ఆర్ఎంఎస్)ను 2018 జనవరి 8న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది.
ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఆ తర్వాత 2020లో ఐఎల్ఆర్ఎంఎస్ పేరును ధరణిగా మార్చారు. అదే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీకి ధరణి నిర్వహణ అప్పగించారు. దీని వెనుక సోమేశ్ హస్తం ఉన్నట్లు తెలిసింది. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ డిఫాల్ట్ లిస్టులో చేరినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ చర్యలు తీసుకోలేదు. ఆ కంపెనీ మెజార్టీ వాటాను 2021 నవంబర్‌లో సింగపూర్‌కు చెందిన ఫాల్కన్ ఎస్జీ కంపెనీకి రూ.1,275 కోట్లకు అమ్ముకుంది.
దీంతో ధరణి విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీలో మెజార్టీ వాటా కొనుగోలు చేసిన ఫాల్కన్ ఎస్జీ కంపెనీ... దాని పేరును టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా మార్చింది. టెర్రాసిస్ టెక్నాలజీస్ ఇండియా బిజినెస్ ను 2021 డిసెంబర్ లో గాది శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటెలా సంస్థకు అప్పగించింది. ధరణిని టెర్రాసిస్ కంపెనీ నిర్వహిస్తుండగా, దానికి టెక్నాలజీ సపోర్ట్‌ను క్వాంటెలా సంస్థ అందజేస్తున్నది.
ఎక్సైజ్ డ్యూటీ ఎగ్గొట్టేలా రూల్స్ తెచ్చి..
గతంలో మద్యం బాటిళ్లపై లేబుల్ కోసం ట్రాక్ అండ్ ట్రేస్ ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ ఫ్రీగా ఇస్తామని ఒక ప్రైవేట్ కంపెనీ ముందుకొచ్చింది. ఆ టైమ్‌లో పేపర్ లేబుల్ఖర్చు 17 పైసలు అవుతుందని నిర్ధారించారు. తర్వాత ఆ కంపెనీ ప్లాస్టిక్ లేబుల్ తీసుకొచ్చింది. ముందు 17 పైసలకే ఒప్పందం చేసుకుని, తర్వాత దాన్ని 40 పైసలకు తీసుకెళ్లారు. దీని కింద నెలకు రూ.20 కోట్లకు పైగా అదనంగా చెల్లిస్తున్నారు.
ఈ వ్యవహారంలో రూ.వెయ్యి కోట్లపైనే గోల్మాల్ జరిగినట్టు తెలిసింది. సోమేశ్ ఎక్సైజ్ కమిషనర్, స్పెషల్ సీఎస్‌గా ఉన్నప్పుడు బేవరేజెస్ కార్పొరేషన్‌లోనూ గుట్టుచప్పుడు కాకుండా చాలా వ్యవహారాలు నడిపినట్టు ప్రభుత్వం దర్యాప్తులో గుర్తించింది. సాధారణంగా సప్లయర్స్ వంద శాతం ఎక్సైజ్డ్యూటీ కట్టాల్సి ఉండగా, కేవలం 30 శాతం ఎక్సైజ్ డ్యూటీ కట్టేలా నిబంధన తీసుకొచ్చారు. ఇందులో మతలబు జరిగినట్టు ప్రభుత్వం భావిస్తున్నది. సప్లయర్స్‌కు రేట్లు పెంచే దానిపై టెండర్ల కమిటీ ఉంటుంది. టెండర్ల కమిటీ లేకుండానే ప్రపోజల్స్ పంపడం ద్వారా కొందరికి మేలు చేశారని తెలిసింది.
ఏపీ క్యాడర్ అయినా తెలంగాణలోనే..
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ఏపీ క్యాడర్‌కు అలాట్ అయ్యారు. కానీ ఆయన అక్కడికి వెళ్లలేదు. తెలంగాణలోనే ఉండి సీఎస్ పోస్టు వరకు ఎదిగారు. క్యాడర్ విషయంలో క్యాట్, హైకోర్టు కలుగజేసు కున్నా.. సోమేశ్ వాయిదాలు కోరుతూ వచ్చారు. చివరకు ఏపీ క్యాడర్లో పని చేయాల్సిందే అంటూ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీంతో చేసేదేమీలేక ఏపీ క్యాడర్ అధికారిగా వెళ్లి, ఆ వెంటనే వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ దగ్గర ముఖ్య సలహాదారు కొలువులో చేరారు. కాగా, ఓఆర్ఆర్ టెండర్ వెనుక కూడా సోమేశ్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనా సర్కార్ ఆరా తీస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.