కోల్ బెల్ట్​ప్రాంతంలో రెచ్చిపోతున్న పైరవీకారులు

కోల్ బెల్ట్​ప్రాంతంలో రెచ్చిపోతున్న పైరవీకారులు
  • నాడు ఇద్దరు ఉద్యోగులపై నామమాత్రపు చర్యలు
  • తాజాగా జూనియర్​అసిస్టెంట్ ఎగ్జామ్​లో నిబంధనలకు నీళ్లు
  • పరీక్షల నిర్వహణ తీరుపై అభ్యర్థుల్లో అనుమానాలెన్నో
  • వరుస ఘటనలతో అభాసుపాలవుతున్న ఆఫీసర్లు

రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో కార్మికులు, ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షల్లో పారదర్శకత లోపిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ పలు పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు తేలినప్పటికీ ఒకరిద్దరిపై నామమాత్రపు చర్యలు తీసుకొని వదిలేయడంతో పైరవీకారులు రెచ్చిపోతున్నారు. ఇటీవల177 జూనియర్​అసిస్టెంట్​పోస్టుల కోసం సింగరేణి నోటిఫికేషన్ వేసిన వెంటనే ఎప్పట్లాగే దళారులు రంగంలోకి దిగి పోస్టులు ఇప్పిస్తామంటూ కోల్​బెల్ట్​వ్యాప్తంగా భారీ మొత్తంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 4న జరిగిన జేఏ ఎగ్జామ్స్​నిర్వహణ తీరుపై అభ్యర్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీల్​ లేని కవర్లలో పేపర్లు రావడం, గతానికి భిన్నంగా సింగరేణి విజిలెన్స్, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సిబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించడాన్ని తప్పుపడ్తున్నారు.కోల్​ బెల్ట్​ ప్రాంతానికి చెందిన ఓ స్టడీ సెంటర్​ నిర్వాహకులు కొందరు అభ్యర్థులను గోవాకు తీసుకెళ్లి ఎగ్జామ్​ రాయించారనే ప్రచారం జరుగుతుండగా, దీనిపై ఎంక్వైరీ చేసి వాస్తవాలేంటో తమ ముందు ఉంచాలని  సింగరేణి ఆఫీసర్లను అభ్యర్థులు డిమాండ్​ చేస్తున్నారు.

పరీక్షల నిర్వహణపై ఆరోపణలు
ఈ నెల 4న జేఎన్టీయూతో కలిసి సింగరేణి యాజమాన్యం నిర్వహించిన జూనియర్​ అసిస్టెంట్​ఎగ్జామ్స్ ​పై అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 177 పోస్టులుండగా 77వేల మందికి పైగా పరీక్ష రాశారు. పలు ఎగ్జామ్​హాల్​లలో సీల్​ లేని కవర్లలో పేపర్లు రావడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. వారి అనుమానాలకు బలం చేకూర్చేలా యాజమాన్యం వ్యవహరించిన తీరు ఉంది. సింగరేణిలో ఉద్యోగ నియామకాలు, ఇంటర్నల్​ఉద్యోగాల ప్రమోషన్లతో భర్తీ లాంటి  ఏ చిన్న ఎగ్జామ్ ​జరిగినా సింగరేణి విజిలెన్స్, ఇంటలిజెన్స్, సెక్యూరిటీ ఆఫీసర్లు, సిబ్బంది కీలక భూమిక పోషిస్తుంటారు. సింగరేణి విజిలెన్స్, ఇంటలిజెన్స్, సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రెండు దశాబ్దాల్లో ఒక్క ఎగ్జామ్​ కూడా జరగలేదు. కానీ జూనియర్​ అసిస్టెంట్​ఎగ్జామ్స్​లో మాత్రం వీరి జాడే లేదు. మరోవైపు ఈ ఎగ్జామ్​పై నెల రోజుల ముందు నుంచే  పలు ప్రచారాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్​ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల అనుచరులతో పాటు కంపెనీలోని ఓ కీలక వ్యక్తితో కలిసి దళారులు, పైరవీకారులు ఒక్కో పోస్టును రూ. 20 లక్షలకు బేరం పెట్టారనే ప్రచారం కోల్​బెల్ట్​ వ్యాప్తంగా సాగింది. కోల్​ బెల్ట్​ ప్రాంతానికి చెందిన స్టడీ సెంటర్​ నిర్వాహకులు కొందరు అభ్యర్థులను గోవాకు తీసుకెళ్లి ఎగ్జామ్​ రాయిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఎగ్జామ్​సెంటర్లలోనూ గతంలో మాదిరిగా పెద్దగా తనిఖీలు లేకపోవడం గమనార్హం. హాల్​ టికెట్లలో అభ్యర్థుల పేర్ల స్థానంలో డిగ్రీ, తెలంగాణ, ఏపీ అని ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోలేదు. గతంలో ఈఅండ్​ఎం ఎగ్జామ్​ టైంలో హాల్​ టికెట్​లో ఫోటో సరిగా లేకున్నా ఇబ్బంది పెట్టిన దాఖలాలున్నాయి. ఈసారి మానవతా దృక్పథంతో అలాంటివి పట్టించుకోలేదంటూ  ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. 

గతంలో నామమాత్రపు చర్యలతో సరి.. 
గతంలో  పలు పరీక్షల సందర్భంగా వచ్చిన ఆరోపణలను, జరిగిన అక్రమాలను యాజమాన్యం పెద్దగా పట్టించుకోకపోవడంతో పైరవీకారులు, దళారుల దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. 2015లో దాదాపు 462కి పైగా క్లరికల్​ పోస్టుల ఎగ్జామ్​ టైంలోనూ పెద్దఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. టీఆర్ఎస్​కి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులతో పాటు సింగరేణి అధికారులు కొందరికి ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉదంటూ అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం సాగింది. అభ్యర్థుల ఫిర్యాదుతో పలువురిని విజిలెన్స్​ఆఫీసర్లు విచారించారు. 2020లో జరిగిన ఈఅండ్​ఎం ఎగ్జామ్​లో బ్లూటూత్​ ఉపయోగించి బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ నుంచి వచ్చినవారు ఇతరుల పేర్లతో ఎగ్జామ్​ రాస్తుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు సింగరేణి ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరినీ  యాజమాన్యం సస్పెండ్​ చేసి చేతులు దులుపుకొంది. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​లో పనిచేస్తున్న  ఓ ఉద్యోగిపై విచారణ రెండేండ్లుగా కొనసాగుతూనే ఉంది. సాధారణంగా సింగరేణిలో ఇలాంటి అక్రమాలు జరిగినప్పుడు  అనుమానితులను విజిలెన్స్​డిపార్ట్​మెంట్​బ్లాక్​ రూంలోకి తీసుకెళ్లి సీసీ కెమెరాల మధ్య విచారణ సాగిస్తుంటుంది. కాగా ఈఅండ్​ఎం ఎగ్జామ్​లో దొరికిన ఉద్యోగులతో పాటు ఎగ్జామ్​ హాల్​లో పట్టుబడ్డవారిని తూతూ మంత్రంగా విచారించడం కంపెనీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 4న జరిగిన జూనియర్​ అసిస్టెంట్​ ఎగ్జామ్​ విషయంలో సీల్​  లేకుండా ఎగ్జామ్​ రూంలోకి పేపర్లు తెచ్చినప్పటికీ యాజమాన్యం పెద్దగా పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కాగా ఎగ్జామ్​లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోలేదని యాజమాన్యం ప్రకటించింది.  

అడుగడుగునా అక్రమాలే..
సింగరేణి కాలరీస్​ కంపెనీలో మెడికల్​ బోర్డు అన్​ఫిట్​ దందా దళారులకు వరప్రదాయినిగా మారింది. అధికార పార్టీకి చెందిన యూనియన్​ లీడర్లతోపాటు కొందరు అధికారులు దళారులతో కుమ్మక్కై మెడికల్​బోర్డులో అన్​ఫిట్​పేర రూ. లక్షల్లో వసూలు చేస్తున్న దాఖలాలున్నాయి. టీబీజీకేఎస్​కు చెందిన ఓ ప్రధాన లీడర్​ మెడికల్​బోర్డు ఉన్న తేదీలకు ఒకటి రెండు రోజుల ముందు వచ్చి అన్ని చక్కదిద్దుకొని పోవడం ఓపెన్​ సీక్రెట్. మెడికల్​బోర్డు అన్​ఫిట్​పరీక్షలకు సంబంధించి గతంలో సింగరేణి మెయిన్​ హాస్పిటల్​లో చీఫ్​ మెడికల్​ ఆఫీసర్లుగా పనిచేసిన వారిపై ఆరోపణలున్నప్పటికీ యాజమాన్యం చూసీ చూడనట్టుగా వ్యవహరించింది. మరోవైపు శ్రీరాంపూర్​, కోయగూడెం ఓపెన్​కాస్టులలో పెద్దఎత్తున జరిగిన డీజిల్​ కుంభకోణాల్లో ఓసీ కాంట్రాక్టర్లతో పాటు కంపెనీలో పనిచేస్తున్న పెద్ద తలకాయలున్నట్టు యాజమాన్యం ప్రాథమిక విచారణలో గుర్తించింది. అక్రమంగా వందల లారీల్లో బొగ్గు తరలింపు, సత్తుపల్లిలో మంచి గ్రేడ్​ను అన్​గ్రేడ్​గా చూపించి బొగ్గును అమ్మిన పలు కేసుల్లోనూ అధికారులున్నట్టుగా విజిలెన్స్​విచారణలో వెల్లడైనప్పటికీ ట్రాన్స్​ఫర్స్​తో యాజమాన్యం సరిపెట్టడంతో కంపెనీలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని కార్మికులు చెబుతున్నారు. ఈ క్రమంలో సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉందని, కంపెనీలో జరుగుతున్న అక్రమాలపై సెంట్రల్​ విజిలెన్స్​తో విచారణ చేయించాలని కొంతకాలంగా బీఎంఎస్​ నేతలు  డిమాండ్​ చేస్తున్నారు.