- ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్నియామకంలో ఇష్టారాజ్యం
- వివాదాస్పదంగా సూర్యాపేట దవాఖాన సూపరిండెంట్ తీరు
- విజిలెన్స్ ఎంక్వైరీ లో బయటపడ్డ అక్రమాలు
- బదిలీ చేస్తే వెళ్లకుండా అనుచరులతో ఆందోళన
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్దండ మురళీధర్‌రెడ్డి తీరు వివాదాస్పదమవుతోంది. గతంలో హాస్పిటల్లో పని చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి, తన సొంత గ్రామానికి చెందిన 70మందిని ఎంప్లాయీస్‌గా నియమించుకోవడంతో పాటు అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు ఇటీవల విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. దీంతో ఉన్నతాధికారులు ఆయనను బదిలీ చేయగా, వెళ్లకుండా శుక్రవారం తన బదిలీకి వ్యతిరేకంగా అనుచరులతో ధర్నా చేయించాడు. ప్రతిగా ఆయన వల్ల రోడ్డున పడ్డ బాధితులు కూడా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
అయిదేండ్లుగా ఇక్కడే తిష్ట..
మాజీ మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అనుచరుడైన దండ మురళీధర్ రెడ్డి సూపరిండెంట్ గా అయిందేండ్లుగా ఇక్కడే తిష్టవేశాడు. ఏదైనా సమస్య వస్తే అప్పటి మంత్రి పేరు చెప్పుకుని గట్టెక్కేవాడు. అప్పటికే ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారందరినీ అకారణంగా పక్కనపెట్టి, తన సొంత గ్రామమైన సూర్యాపేట మండలం కేసారానికి చెందిన 70మందిని శానిటైజేషన్, వార్డ్ బాయ్స్, సెక్యూరిటీ గార్డ్స్, కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించాడు. వారి నుంచి లక్షల్లో ముడుపులు తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చినా మంత్రి భయంతో ఆఫీసర్లు పట్టించుకోలేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు మూడు నెలల క్రితం హైదరాబాద్ ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టి సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేసింది.
పోటాపోటీ ఆందోళనలతో ఉద్రిక్తత
బదిలీపై వెళ్లడం ఇష్టం లేని మురళీధర్‌రెడ్డి తాను నియమించిన ఔట్సోర్సింగ్ఉద్యోగులను అడ్డుపెట్టి డ్రామాకు తెరతీశాడు. శుక్రవారం వారంతా సూపరిండెంట్ బదిలీకి వ్యతిరేకంగా దవాఖానలో ధర్నా చేశారు. వీరికి కొంతమంది బీఆర్‌ఎస్ లీడర్లు వత్తాసు పలికారు. విషయం తెలిసి, గతంలో మురళీధర్‌రెడ్డి తొలగించిన బాధితులు అక్కడికి చేరుకొని పోటీగా ఆందోళన చేశారు. అన్యాయంగా తమ ఉద్యోగాలను ఊడగొట్టిన మురళీధర్‌రెడ్డిని ఇక్కడి నుంచి పంపించాల్సిందేనని డిమాండ్ చేశారు. పోటాపోటీ ఆందోళనలతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.