బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ(కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్(యుఆర్ఎస్)లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని లక్డీకపూల్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆఫీసులో మెమోరాండం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డబ్బులు ఇచ్చిన వారికే విద్యాశాఖ అధికారులు పోస్టులు ఇచ్చారన్నారు.
రెండో శనివారం సెలవు ఉన్నప్పటికీ ఫైనల్ లిస్ట్ పెట్టారని, ఆదివారం పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారని గుర్తుచేశారు. నియామక ప్రక్రియ సెలవు రోజున ఎందుకు చేయాల్సి వచ్చిందనిభాను ప్రకాశ్ ప్రశ్నించారు. మెరిట్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారన్నారు. వెంటనే పాత భర్తీ ప్రక్రియను రద్దు చేసి, మళ్లీ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.