- లోన్లు మంజూరయ్యక కట్టలేదంటూ నోటీసులు
- లోన్ఇచ్చేది కొంత.. రికార్డుల్లో అంతకుమించి నమోదు
- వాయిదాలు చెల్లించలేక లబోదిబోమంటున్న బాధితులు
- అక్రమాలు జరిగినా దోషుల నుంచి రికవరీ శూన్యం
జగిత్యాల, వెలుగు: మహిళా సంఘాల లోన్లు ముసుగులో కొందరు సెర్ప్సిబ్బంది, ఆర్పీలు అక్రమాలకు తెరతీస్తున్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వాలంటూ మహిళా సంఘ సభ్యులను ఒప్పించి వారి పేరిట వచ్చిన లోన్లను వారికి తెలియకుండానే నొక్కేస్తున్నారు. ఇంకొందరు పైఅధికారులకు, బ్యాంక్ అధికారులకు కమీషన్లు ఇవ్వాలంటూ అందిన కాడికి సభ్యుల నుంచి గుంజుతున్నారు. మరికొందరైతే లోన్వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకుల్లో జమచేయకుండా నొక్కేస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని మహిళా సభ్యులు ఇచ్చిన డబ్బులనూ నొక్కేస్తున్నారు.
కొందరు బ్యాంకు అధికారులతోనూ కుమ్మక్కై లోన్ల సొమ్ము కాజేస్తున్నారు. తనిఖీల్లో దొరకకుండా రికార్డులను మేనేజ్ చేస్తున్నారు. బ్యాంకుల్లోని డాక్యుమెంట్స్ లో ఎక్కువగా లోన్పొందినట్లుగా రికార్డుల్లో ఉండగా మహిళా సంఘం సభ్యులు మాత్రం అంతమొత్తం తాము తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని వాయిదాలు కట్టినా బాకీ తీరకపోవడంతో లబోదిబో మంటున్నారు. గతంలో జిల్లాలో డ్వాక్రా రుణాల విషయంలో రూ.కోట్లలో స్కాములు జరిగినా ఉన్నతాధికారులు మాత్రం నామమాత్రపు తనిఖీలతో ముగించేస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో నిందితులు వెలుగులోకి రావడంలేదనే విమర్శలున్నాయి.
పొలిటికల్ లీడర్ల సెటిల్ మెంట్లు
ఆర్పీలు లోన్ డబ్బుల విషయంలో చేతివాటం ప్రదర్శిస్తుండగా కొందరు పొలిటికల్ లీడర్లు సెటిల్ మెంట్లు చేస్తూ వారిని వెనకేసుకొస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు మహిళలను తీసుకొచ్చే బాధ్యత ఆర్పీలపై పెట్టడమే అందుకు కారణమవుతోంది. సగం డబ్బులు సంఘం సభ్యులు కడితే మిగతా సగం ఆర్పీలతో కట్టిస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో కొందరు ఆర్పీల అక్రమ దందా యథేచ్చగా సాగుతోందనే సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇన్ని అక్రమాలు జరిగినా దోషుల నుంచి రికవరీ జీరోగా ఉంటోంది.
‘కోరుట్లకు చెందిన చిట్యాల సుకన్య పేరును ఓ ఆర్పీ ఆమెకు తెలియకుండానే మహిళా సమాఖ్యలో చేర్చారు. ఆమె పేరిట రుణం తీసుకోవడంతో సదరు మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.’
‘2023 జులైలో బీర్పూర్ గ్రామైక్య మహిళ సంఘాల్లోని 450 మంది మహిళలకు 2017--–18లో స్త్రీ నిధి నుంచి రూ.14.50 లక్షల లోన్లు శాంక్షన్ అయ్యాయి. కొందరు ఆర్పీలు.. మహిళల పేరిట లోన్లు తీసుకున్నారు. లోన్బకాయిలు చెల్లించాలని సదరు మహిళలకు సెర్ప్నుంచి నోటీసులు వచ్చాయి. కానీ తాము లోన్లు తీసుకోలేదని సదరు మహిళలు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. ’