సీఎంఆర్‌‌‌‌గా రేషన్ బియ్యం!

  •    -రేషన్ దుకాణాల నుంచి సేకరించి కార్పొరేషన్‌‌కు తరలింపు
  •     జిల్లాలో ఒక్కొక్కటిగా బయట పడుతున్న మిల్లర్ల అక్రమాలు 
  •     మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశాలతో విజిలెన్స్ తనిఖీలు 
  •     క్వాలిటీ లేని బియ్యానికి అప్రూవల్ ఇచ్చిన ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

సూర్యాపేట, వెలుగు: సీఎంఆర్‌‌‌‌ ‌‌(కస్టం మిల్లింగ్ రైస్) విషయంలో మిల్లర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. సివిల్‌‌ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టిన  విజిలెన్స్ అధికారులు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.   ప్రభుత్వం సీఎంఆర్‌‌‌‌ కింద కేటాయించిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌‌లో అమ్ముకొని ఆ లోటు భర్తీ చేసేందుకు రేషన్ దుకాణాల నుంచి పీడీఎస్  బియ్యాన్ని సేకరించి సివిల్ సప్లై కార్పొరేషన్‌‌కు అప్పగించినట్లు తేల్చారు.  బియ్యం క్వాలిటీ లేదని తెలిసినా అప్రూవల్ ఇచ్చిన అధికారులుపై చర్యలు తీసుకుంటున్నారు. పీడీఎస్‌‌ బియ్యం రవాణాపైనా నిఘా పెట్టారు.  

క్వాలిటీ లేని బియ్యానికి అప్రూవల్ 

గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లకు కేటాయించిన సీఎంఆర్‌‌‌‌ను అమ్ముకున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులోభాగంగా పెండింగ్ సీఎంఆర్‌‌‌‌ను ఫిబ్రవరి 29లోగా ఎఫ్‌‌సీఐకి అప్పగించాలని మిల్లర్లపై ఒత్తిడి పెంచింది.  దీంతో మిల్లర్లు డీలర్ల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి సీఎంఆర్‌‌ కింద ఎఫ్‌‌సీఐకి ఇవ్వడం ఇచ్చారు. అయితే క్వాలిటీ లేకపోవడంతో ఎఫ్‌‌సీఐ ఈ బియ్యాన్ని చాలా వరకు  రిజెక్ట్ చేసింది. 

దీంతో  నేరు సివిల్‌‌ సప్లై కార్పొరేషన్‌‌కు అప్పగించడం మొదలు పెట్టారు.  క్వాలిటీ లేకపోయినా కార్పొరేషన్ ఉద్యోగులు మిల్లర్ల నుంచి ముడుపులు తీసుకొని అప్రోవల్ ఇచ్చారు. ఇందులో జిల్లాలోని ఒక అసోసియేషన్‌‌కు చెందిన మిల్లర్ చక్రం తిప్పినట్లు సమాచారం. 

ఉత్తమ్ ఆదేశాలతో అక్రమాలకు కళ్లెం

పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి  పీడీఎస్‌‌ బియ్యాన్ని అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు మిల్లులు, సివిల్ సప్లై కార్పొరేషన్‌‌లపై తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.  దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేసి అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.  సివిల్ సప్లై ఉద్యోగులు 25 లారీల పీడీఎస్‌‌ బియ్యాన్నికి ఒక్కో లారీకి రూ.2లక్షల చొప్పున తీసుకొని అప్రూవల్ ఇచ్చినట్లు తేల్చారు.  

పూర్తి స్థాయి  రిపోర్ట్‌‌ను 10 రోజుల కింద సివిల్ సప్లై కమిషనర్‌‌‌‌కు అందించడంతో క్వాలిటీ లేని బియ్యాన్ని పాస్ చేసిన ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు.  వీటితో పాటు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌‌ బియ్యాన్ని  పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.  రెండు నెలల్లోనే జిల్లాలో 610.36 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకోవడంతో పాటు 13 కేసులు నమోదు చేసి   20 మందిని అరెస్ట్ చేశారు.

కోదాడ కేంద్రంగా రేషన్ దందా

సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా రేషన్ బియ్యం దందా జోరుగా నడుస్తోంది. రేషన్ డీలర్లు నేరుగా సివిల్ సప్లై గోదాం నుంచి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌‌కు తరలిస్తున్నారు.  వ్యాపారులు దళారులను పెట్టుకొని  ఇండ్లకు తిరిగి పీడీఎస్ బియ్యం సేకరిస్తున్నారు. ఈ బియ్యాన్ని కొందరు బడా వ్యాపారులు కోదాడ, అనంతగిరి, నడిగూడెం మండలాల్లో నిల్వ చేసి గుట్టు చప్పుడు కాకుండా రీ సైక్లింగ్ చేస్తున్నారు.  

ఈ బియ్యాన్ని  మిల్లర్లకు అమ్ముతుండగా.. వాళ్లు సీఎంఆర్ కింద వచ్చిన బియ్యంగా చూపిస్తున్నారు.  ఈ దందాలో ఖమ్మంకు చెందిన ఒక వ్యాపారి, జగ్గయ్య పేటకు చెందిన మరో వ్యాపారి, స్థానికంగా కొందరు మిల్లర్లు కీలకంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం దీన్ని సీరియస్‌‌గా తీసుకోవడంతో తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.