ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో ప్రధాన మిర్చి మార్కెట్లలో ఒకటైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి దళారుల దందా జోరుగా నడుస్తోంది. బుధవారం కోల్డ్ స్టోరేజీ మిర్చి క్వింటాకు రూ.18 వేలకు కొనుగోలు చేయగా.. ఈ సీజన్లోనే ఇదే అతి తక్కువ ధర పలికింది. ఎక్కువ మంది రైతుల మిర్చి క్వాలిటీ తక్కువగా ఉందంటూ రూ.16వేల నుంచి రూ.14 వేల లోపు రేటుకు వ్యాపారులు కొనుగోలు చేశారు. రాబోయే రోజుల్లో మరింత రేటు పడిపోతుందన్న భయంతో గత రెండ్రోజుల్లో దాదాపు15 వేల బస్తాల మిర్చిని రైతులు అమ్ముకున్నారు. ఆర్నెళ్ల కింద క్వింటా రూ.20 వేలకు పైగా ఉన్నప్పుడు రేటు పెరుగుతుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు.
ఇప్పుడు ధర పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇదే సమయంలో వ్యాపారుల మరింత తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కింద అధికంగా రూ.25,300 పలికింది. మళ్లీ ఈ ఏడాది కూడా ధర పెరుగుతుందన్న అంచనాలతో మిర్చిని దాచుకోగా.. చివరకు రైతులకు నష్టాలే మిగిలాయి. ఎక్స్పోర్ట్ ఆర్డర్లు లేవని, అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ లేదని.. ఇలా పలురకాల కారణాలతో రేటు పడిపోతోందని వ్యాపారులు చెబుతున్నారు.
ఆర్డీ దందాతో సర్కార్ ఖజానాకు గండి!
మిర్చికి ధర తక్కువ ఇస్తూ రైతులను ముంచుతున్న వ్యాపారులు, మరోవైపు సర్కార్ ఖజానాకి కూడా గండి కొడుతున్నారు. వాస్తవానికి రైతు నుంచి కొన్న ధరను మార్కెట్ రికార్డుల్లో ఎంట్రీ చేయకుండా దందా కొనసాగిస్తున్నారు. వ్యాపారులు, ట్రేడర్లు, అధికారులు కోడ్భాషలో దీన్ని ఆర్డీ(రేట్ డిఫరెన్స్) గా పిలుచుకుంటారు. రైతుల కష్టాలు, సీజన్లతో సంబంధం లేకుండా ఆర్డీ దందా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. క్వాలిటీ రెడ్ మిర్చి క్వింటాకు రూ.14 వేల నుంచి 18 వేల వరకు కొనుగోలు చేసినా, బిల్లు మాత్రం తాలు మిర్చిగా చూపించి అందులో సగం ధరకే రికార్డుల్లో ఎంట్రీ చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని అమ్ముకునేందుకు మార్కెట్ కు రైతులు కేవలం శాంపిల్ ను మాత్రమే తీసుకొస్తారు.
మొత్తం సరుకును డైరెక్ట్ గా కొనుగోలుదారులే కోల్డ్ స్టోరేజీ నుంచి తీసుకుంటారు. ఇది పూర్తిగా మార్కెట్ కు బయట జరుగుతుండడంతో ఆర్డీ దందాకు బ్రేక్ పడడం లేదు. ఇలా మంచి క్వాలిటీ ఉన్న మిర్చిని తాలుగా చూపించి, మార్కెట్ నుంచి బయటకు తరలిస్తుంటారు. రెండేళ్ల కింద ఇలా మూడు లారీలను కమర్షియల్ ట్యాక్స్అధికారులు పట్టుకుని ఫైన్ వేశారు. అయినా ఈ దందాకు తాత్కాలికంగా బ్రేక్వేసి, మళ్లీ తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారుల కనుసన్నల్లో ముగ్గురు ట్రేడర్లు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ లో ఉంటూ, చాంబర్ ఆఫ్ కామర్స్ లో కీలకంగా ఉన్న ఆ వ్యాపారులే ఆర్డీ దందా నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆఫీసర్లకు వాటాలు ఇస్తుండగా..
ఆర్డీ దందాలో దడువాయిలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. కంప్లయింట్ వచ్చిన సమయంలో మాత్రమే హడావుడి చేస్తున్న ఆఫీసర్లు ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఆర్డీ దందా నడిపించే దడువాయిలకు బస్తాకు రూ.10, బస్తాల లెక్క తక్కువగా నమోదు చేస్తే మార్కెట్ సెక్యూరిటీ గార్డ్, సూపర్ వైజర్, యార్డ్ ఇన్ చార్జ్ నుంచి ఆఫీసర్ల వరకు బస్తా కు రూ.30 చొప్పున వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు మిర్చి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారులు ఈ ఆర్డీ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
రేటును తక్కువగా చూపించడం ద్వారా ఆ రేటుకే జీఎస్టీ, మార్కెట్ సెస్ చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతోంది. ఇది మార్కెట్ లో రెగ్యులర్గా, కామన్ గా జరిగే వ్యవహారమేనని వ్యాపారులు కొట్టిపడేస్తున్నారు. ఈ అక్రమ దందాపై మార్కెట్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టి పెడితే చెక్ పెట్టొచ్చు. కోల్డ్ స్టోరేజీలో రికార్డుల ప్రకారం మిర్చి అమ్మిన రైతుకు పడిన ధర ఎంక్వైరీ చేసి, మార్కెట్ లో రేటు ఎంట్రీ చేసిన రికార్డులను పరిశీలిస్తే ఈజీగా ఆర్డీ దొంగలను పట్టుకోవచ్చు.
రూ.14,500కే అమ్ముకున్నా..
నాలుగు నెలల కింద 38 బస్తాలు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వచేశాను. రేటు పడిపోతుందన్న భయంతో బుధవారం అమ్ముకుదామంటే క్వింటా రూ.14500 పలికింది. మొత్తం 15 క్వింటాలు దాచినందుకు నష్టమే మిగిలింది.
– శ్రీనివాస్, పాపాయిగూడెం, తిరుమలాయపాలెం మండలం
రూ.40 వేలు నష్టపోయా..
ఐదు నెలల కింద మిర్చి రేటు క్వింటా రూ.21 వేలు ఉన్నప్పుడు ధర పెరుగుతుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీలో18 బస్తాలు నిల్వచేశా. ఇప్పుడు క్వింటా రూ.15,600 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. కోల్డ్ స్టోరేజ్ లో 5 నెలలు ఉంచినందుకు బస్తాకు రూ.212 చొప్పున కిరాయి కట్టాను. తగ్గిన రేటు, కిరాయి ఖర్చులు కలుపుకొని మొత్తం రూ.40 వేలు నష్టపోయా.
– సీమా వడ్తియా, లోక్యాతండా, కుసుమంచి మండలం