
- కోదాడ, హుజుర్ నగర్ గోదాముల్లో సీఎంఆర్ ధాన్యం పక్కదారి
- సిబ్బంది ఫిర్యాదుతో విచారణ చేపట్టిన స్టేట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు
- ధాన్యం రాకున్నా వే బిల్లులతో మేనేజ్ చేసినట్టు రిపోర్ట్
సూర్యాపేట/ కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లాలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో ఇంటి దొంగలు పడ్డారు. సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. స్టాక్ లేకున్నా ఉన్నట్లు చూపించి అక్రమాలకు పాల్పడ్డారు. కోదాడ, హుజూర్ నగర్ స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో గుట్టు చప్పుడు కాకుండా దందా నడుస్తుండగా.. ఇటీవల అందిన ఫిర్యాదుతో స్టేట్ వేర్ హౌసింగ్ కమిషనర్ ఎంక్వైరీకి ఆదేశించారు.
టాస్క్ ఫోర్స్ అధికారులు విచారణ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. మిల్లుల నుంచి వచ్చే సీఎంఆర్ ధాన్యంతో పాటు గోదాముల్లోని స్క్రాప్ ను కూడా అమ్ముకున్నట్లు తేల్చారు. ఎంక్వైరీ రిపోర్ట్ ను కమిషనర్ కు అందించగా త్వరలోనే చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
మిల్లర్లతో చేతులు కలిపి..
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను సీఎంఆర్ కోసం మిల్లర్లకు అందిస్తుంది. బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. కాగా.. ఇప్పటికే జిల్లాలోని కొందరు మిల్లర్లు అధికారుల అండదండలతో సుమారు రూ. వెయ్యి కోట్ల సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
తాజాగాస్టేట్ వేర్ హౌసింగ్ సిబ్బంది కూడా అక్రమాల్లో భాగస్వాములు అయ్యారు. కోదాడలోని కొందరు మిల్లర్లతో కలిసి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాము ఇన్ చార్జ్ రవి కుమార్ సీఎంఆర్ ధాన్యం గోదాముకు రాకున్నా వచ్చినట్లు వే బిల్లులను మేనేజ్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఇది ఉన్నతాధికారులకు తెలియడంతో ఆయనను హుజూర్ నగర్ స్టేట్ వేర్ హౌసింగ్ గోదాము ఇన్ చార్జ్ గా బదిలీ చేశారు. అక్కడ కూడా తీరు మార్చుకోకుండా సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇది కాస్త స్టేట్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో ఎంక్వైరీ చేయాలని టాస్క్ ఫోర్స్ ను ఆదేశించగా అసలు నిజాలు తెలిశాయి.
సిబ్బంది ఫిర్యాదుతో వెలుగులోకి..
కమిషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అసలు వాస్తవాలు తెలియడంతో విస్తుపోయారు. రెండు నెలల్లోనే సుమారు 600 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యం మిల్లుల నుంచి రాకున్నా వచ్చినట్లు మేనేజ్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా కోదాడలో ఇదే తరహా అక్రమాలకు పాల్పడుతూ దాదాపు1,000 క్వింటాళ్ల ధాన్యం పక్కదారి పట్టించినట్టు తేల్చారు.
అంతేకాకుండా గోదాములో సుమారు రూ.20 లక్షల స్క్రాప్ బయట అమ్ముకున్నట్లు తేలింది. దీంతో ఆయనను తప్పించి మిర్యాలగూడ ఇన్ చార్జ్ కు బాధ్యతలు ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ఆధారంగా త్వరలోనే అక్రమాలకు పాల్పడిన అధికారిపై వేటు వేసే చాన్స్ ఉంది.