సిర్పూర్‌టి మండలంలోని రెండు మిల్లుల్లోనే సుమారు రూ.9 కోట్ల విలువైన ధాన్యం మాయం
మొన్న లక్ష్మీ నరసింహా రైస్ మిల్లు లో 36 వేల బస్తాలు మిస్సింగ్
తాజాగాశ్రీ సాయి బాలాజీ 69 వేల ధాన్యం బస్తాలు లెక్కతేలలే
తనిఖీలకు వచ్చిన ఆఫీసర్లకు ముప్పుతిప్పలు
కాగజ్ నగర్, వెలుగు: రైతుల నుంచి కొనుగోలు చేసి మరాడించేందుకు ఇచ్చిన ధాన్యాన్ని కొందరు రైస్‌మిల్లర్లు పందికొక్కుల్లా మెక్కారు. కస్టమ్మిల్లింగ్రైస్కింద ఎఫ్‌సీఐకి లెవీ పెట్టకుండా పక్కదారి పట్టించారు. తాజాగా జరుగుతున్న విజిలెన్స్తనిఖీల్లో మిల్లర్ల అక్రమాలు బయటపడుతున్నాయి. మొన్న సిర్పూర్‌టి మండలంలోని లక్ష్మీ నరసింహా రైస్ మిల్లు లో 36 వేల బస్తాలు మాయం కాగా, సోమవారం శ్రీ సాయి బాలాజీ అగ్రోటెక్మిల్లులో 69 వేల ధాన్యం బస్తాలు లెక్కతేలలేదు. కోట్ల విలువైన వడ్లను మాయం చేసిన మిల్లర్లు.. తనిఖీలకు వచ్చిన ఆఫీసర్లను ముప్పుతిప్పలు పెడ్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
రూ.5కోట్ల 90 లక్షల విలువైన ధాన్యం మాయం..
శ్రీసాయి బాలాజీ మిల్లులోపల స్టాక్ వెరిఫై చేయగా నివ్వెరపోయే అంశాలు వెలుగు చూశాయి. 2022–-23 రబీ తో పాటు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సీ ఎం ఆర్ కోసం సర్కారు ఇచ్చిన రూ.5కోట్ల 90 లక్షల విలువైన ధాన్యం మాయమయ్యాయి. ఈ తనిఖీల అనంతరం జిల్లా సివిల్ సప్లై మేనేజర్ నరసింహారావు , విజిలెన్స్ఆఫీసర్లు కలిసి వివరాలు వెల్లడించారు.
గత రబీ సీజన్‌కు సంబంధించి 37 ,025 బస్తాలకుగాను 9,0 37 బస్తాలు మాత్రమే లెక్కతేలిందని, 27, 386 బస్తాలు మాయమయ్యాయన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సీ ఎం ఎం ఆర్ కింద 42,130 బ్యాగుల ప్యాడీ ఇవ్వగా, ఇందులో కేవలం 122 బస్తాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. తక్కువగా ఉన్న 69 వేల 394 బస్తాల ధాన్యం విలువ రూ.5 కోట్ల 90 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ రైస్ మిల్లు పై కేసు నమోదు చేసి, నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని డీఎం నరసింహారావు పేర్కొన్నారు.
కాగా, ఆరు రోజుల క్రితం సిర్పూర్ టి మండలం వేంపల్లి లో లక్ష్మీ నరసింహా రైస్ మిల్లు లో రూ.2.80 కోట్ల విలువైన 36 వేల బస్తాల ధాన్యం బస్తాలు మాయం కాగా, తాజాగా ఇదే మండలంలోని రైస్ మిల్లు లో ఏకంగా 69,394 బస్తాలు లెక్కతేలకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తనిఖీల్లో ఏ సీ ఎస్ ఓ వినోద్, స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్లు శ్రీనివాస్, రాజ్ కుమార్, శ్యామ్ లాల్, సిబ్బంది పాల్గొన్నారు.
మిల్లుకు తాళం వేసి పరార్..
కుమ్రంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం వెంకట్రావు పేట్ సమీపంలోని శ్రీ సాయి బాలాజీ అగ్రోటెక్ రైస్ మిల్లులో స్థానిక రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు నాలుగు రోజుల క్రితం తనిఖీలకు వెళ్లగా, మిల్లు యజమాని గేట్‌కు తాళం వేసి పరారయ్యారు. లోపల నిర్మాణ పనులు జరుగుతున్నాయంటూ మిల్లు సిబ్బంది తప్పించుకున్నారు. ఆఫీసర్లు ఒత్తిడి చేయడంతో బయట గేటు తాళం తీసినా లోపల మిల్లు తాళం మాత్రం తీయలేదు.
దీంతో ఆఫీసర్లు స్టాక్ వెరిఫై చేయకుండానే తిరుగుముఖం పట్టారు. శనివారం మరోసారి రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు వచ్చినా మిల్లు యజమాని సహా ఎవరు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆఫీసర్లు గేటుకు తాళం వేసి నోటీస్ అంటించి వెళ్లారు. సోమవారం కరీంనగర్ రేంజ్ విజిలెన్స్ అధికారుల బృందం తహసీల్దార్ దినేష్ చంద్రా రెడ్డి, సీఐ లు అనిల్ కుమార్, ప్రశాంత్ రావు, స్థానిక రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ఆఫీసర్లతో కలిసి మిల్లుపై దాడులు నిర్వహించారు. మిల్లుకు తాళం వేసి ఉండడం, యజమానికి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా స్పందించకపోవడంతో వీడియోగ్రాఫర్సమక్షంల తాళం పగలగొట్టించి లోపలికి వెళ్లారు.