నో రికవరీ, నో బ్లాక్ లిస్ట్

  • సీఎంఆర్​లో బయటపడుతున్న అక్రమాలు
  • సూర్యాపేట జిల్లాలో బయటపడ్డ రూ.400 కోట్ల అక్రమాలు 
  • బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్న మిల్లర్లు

సూర్యాపేట, వెలుగు : సీ‌ఎం‌ఆర్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలంటూ ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తే వారు బియ్యం తిరిగి ఇవ్వకుండా బయట మార్కెట్​లో అమ్ముకొని వ్యాపారం చేసుకుంటున్నారు. గట్టిగా ఒత్తిడి తెస్తే రేషన్ బియ్యాని రీ–సైక్లింగ్ చేసి ప్రభుత్వానికి అంట గడుతున్నారు. ఇంత జరుగుతున్నా మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదు.

రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వసూళ్లు చేయడం లేదు. మిల్లర్ల అసోసియేషన్ నేతల అండతోనే ఈ వ్యవహారం సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో రూ.400 కోట్ల పైగా అక్రమాలు జరిగినట్లు గుర్తించినా గింజ రికవరీ చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అసోసియేషన్ నాయకుల అండతో.. 

సూర్యాపేట జిల్లాలో దాదాపు 10కి పైగా మిల్లులు సీఎం‌ఆర్ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించినట్లు తనిఖీల్లో తేలింది. అయినా, మిల్లులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో మిల్లర్స్ అసోసియేషన్ నాయకుడు అధికార యంత్రాంగాన్ని శాసిస్తూ మిల్లులపై చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని బహిరంగ చర్చ జరుగుతోంది. వందల కోట్ల విలువైన సీ‌ఎం‌ఆర్ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ ల్లో అమ్ముకున్న మిల్లులపై కేసులు నమోదు చేస్తున్నారే తప్ప.. వాటి నుంచి రికవరీ మాత్రం చేయడం లేదు.

అంతేకాకుండా కొంతమంది అధికారులు కేసులు నమోదు చేసినా వాటి నుంచి తప్పించుకునేలా వారికి సలహాలు కూడా ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోదాడకు చెందిన ఒక రైస్ మిల్లులో రూ.60 కోట్ల సీఎం‌ఆర్ ధాన్యాన్ని మార్కెట్ లో అమ్ముకున్నారు. దీనిపై సివిల్ సప్లయ్ అధికారులు ఆర్‌ఆర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రికవరీకి ఆదేశించారు. కానీ, సివిల్ సప్లయ్ శాఖకు చెందిన ఒక ఉద్యోగి సదురు మిల్లుపై చర్యలు తీసుకోకుండా కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చారు.

దీంతో మిల్లుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు వచ్చాక సదరు మిల్లర్ మిల్లును యథావిధిగా నడిపిస్తున్నారు. సూర్యాపేటకు చెందిన మరో మిల్లర్ సీ‌ఎం‌ఆర్ ధాన్యాన్ని బయట మార్కెట్​లో అమ్ముకునేందుకు లారీల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. చివరకు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు. 

నో రికవరీ..

సీ‌ఎం‌ఆర్ బియ్యం తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తున్న మిల్లర్లపై చర్యలు కరువయ్యాయి. జిల్లా వ్యాప్తంగా గత రెండేండ్లు కేసులు నమోదు చేసిన అధికారులు.. వారి నుంచి నేటికీ ఒక్క గింజ కూడా రికవరీ చేయలేదు. సూర్యాపేట జిల్లాలో 2022– -23 ఖరీఫ్ కు సంబంధించిన 8 మంది మిల్లర్లు దాదాపు రూ.200 కోట్ల విలువైన సీ‌ఎం‌ఆర్ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. గతంలో నోటీసులు ఇచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీనితో మిల్లుల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు సీ‌ఎం‌ఆర్ బియ్యం పక్కదోవ పట్టినట్లు గుర్తించి మిల్లులను సీజ్ చేయడంతోపాటు యజమానులపై కేసులు నమోదు చేశారు.

గతేడాది కోదాడ మండలం కాపుగల్లు ఉషశ్రీ రైస్ మిల్లు యజమాని రూ.36 కోట్ల విలువైన సీఎం‌ఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ఏడాది గడుస్తున్నా ఆ మిల్లు నుంచి ధాన్యాన్ని రికవరీ చేయలేదు. ఇదిలా ఉంటే నేరేడు చర్ల మండలం ముకుందపురానికి చెందిన లక్ష్మీసహస్ర మిల్లులో రూ.30 కోట్ల సీ‌ఎం‌ఆర్ ధాన్యం పక్కదారి పట్టినా నేటికీ రికవరీ చేయలేదు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని సదురు మిల్లర్లు కోర్టులను ఆశ్రయించి తిరిగి మిల్లులను తెరిచి వ్యాపారం చేసుకుంటున్నారు.

గత వారం రోజుల క్రితం జరిపిన తనిఖీల్లో దాదాపు రూ.300 కోట్ల విలువైన సీ‌ఎం‌ఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు తేలింది. మూడు మిల్లులపై కేసులు నమోదు చేసిన అధికారులు వీటిని కూడా పక్కదారి పట్టిస్తారా.. రికవరీ చేస్తారో వేచిచూడాలి.