- కానుకూరులో అనధికారికంగా వెలిసిన కొనుగోలు సెంటర్
- రైతులను దోచుకుంటున్న జైపూర్ డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకులు
- అడిషనల్ కలెక్టర్‌కు చెప్పినా స్పందనలేదు: ఎంపీపీ భర్త, సర్పంచ్
- బినామీ పేర్లతో మండలంలో ఎనిమిది సెంటర్లు ఉన్నట్లు ఆరోపణలు
- సివిల్ సప్లయ్ ఆఫీసర్ల సహకారంతోనే అక్రమ దందా
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయి. అధికారులు రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక్కో కొనుగోలు సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాలకు కేటాయించిన సెంటర్లలోనే వడ్ల కొనుగోళ్లు చేయాలి.
కానీ కొందరు నిర్వాహకులు ఎలాంటి పర్మిషన్ లేకుండా పక్క గ్రామాల్లో అక్రమంగా సెంటర్లు నడుపుతుండడం వివాదాస్పదంగా మారింది. జైపూర్ మండలం కానుకూరులో అక్రమంగా కొనుగోలు సెంటర్ వెలిసింది. ఈ సెంటర్‌ను జైపూర్ మండల కేంద్రంలోని డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహికులే నడిపిస్తున్నట్లు అక్కడి రైతులు చెప్తున్నారు.
ఏజెంట్లను పెట్టుకొని కొనుగోళ్లు
కానుకూరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ముదిగుంట గ్రామం ఉంది. అక్కడ రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయడానికి జైపూర్ మండల ఎంపీపీ భర్త లక్ష్మణ్డీసీఎంఎస్ ద్వారా పర్మిషన్ తీసుకొని సెంటర్‌ను నడిపిస్తున్నాడు. కానుకూరుకు చెందిన రైతులు ముదిగుంట డీసీఎంఎస్ సెంటర్ కు ధాన్యాన్ని తరలించి అక్కడ అమ్ముకోవాలి. కానీ జైపూర్ మండల కేంద్రంలోని డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకులు కానుకూరులో కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని వారికి కమీషన్లు ఇస్తూ ముదిగుంట డీసీఎంఎస్ సెంటర్‌కు రైతులు వడ్లను తరలించకుండా అడ్డుకుంటూ.. కానుకూరులో అక్రమంగా కొనుగోళ్లు జరుపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ట్రక్ షీట్లు ఇవ్వడం లేదని, కొనుగోలు సెంటర్ నుంచి వెళ్లే లారీలకు కూడా రైస్ మిల్లులో అన్లోడ్ అయిన తరువాతే ట్రక్ షీట్లు ఇస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. కానుకూరు నుంచి 17 లారీల వడ్లను తరలించినట్లు స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా బస్తాకు 41 కిలోలు కాంటా వేయాల్సిన చోట 42 కిలోలు వేస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కొనుగోలు సెంటర్ ఉన్న చోటుకే గన్నీ బ్యాగులు, లారీలు పంపించాలని ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయి.
అయితే, అక్రమంగా నడుపుతున్న ఈ కొనుగోలు సెంటర్‌కు కూడా సంబంధిత ఆఫీసర్లు గన్నీ బ్యాగులు, లారీలను పంపిస్తుండడంతో సదరు ఆఫీసర్ల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమంగా నడిపిస్తున్న ఈ కొనుగోలు సెంటర్‌పై అడిషనల్కలెక్టర్ మోతీలాల్‌ను నేరుగా కలిసి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని జైపూర్ ఎంపీపీ భర్త లక్ష్మణ్, కానుకూరు సర్పంచ్వెంకటేశ్వర్గౌడ్ పేర్కొన్నారు.
జైపూర్ మండలంలో సుమారు ఎనిమిది సెంటర్లు బినామీల పేర్లపై నడుస్తున్నాయని సమాచారం. మండల కేంద్రంలోని డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకులతో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న జిల్లా అధికారి, సీనియర్ అసిస్టెంట్ సహకారంతోనే ఇవి నడుస్తున్నాయని ఆరోపణలున్నాయి.
అక్రమంగా కొనుగోళ్లు చేయొద్దు
గ్రామాల్లో కొనుగోలు సెంటర్ లేకపోతే పక్కన ఉన్న సెంటర్లో రైతులు ధాన్యం అమ్మాలి. కానీ ఎక్కడో దూరంలో ఉన్న సెంటర్‌కు ధాన్యాన్ని తరలించి అమ్మకూడదు. ఒక సెంటర్ నిర్వాహకులు మరో చోట అక్రమంగా కొనుగోళ్లు చేయొద్దు. కానుకూరులో డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు సెంటర్‌కు పర్మిషన్ కావాలని గ్రామస్తులు మా దృష్టికి తీసుకువచ్చారు. యాసంగి సీజన్లో పర్మిషన్ ఇస్తామని చెప్పాం.
-
తిప్పని లింగన్న, చైర్మన్, డీసీఎంఎస్
ఎంక్వయిరీ చేస్తాం..
కానుకూరులో అక్రమంగా కొనుగోలు సెంటర్ నిర్వహిస్తున్న విషయం నాకు తెలియదు. దీనిపై ఎంక్వయిరీ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.
-
రమేశ్, తహసీల్దార్, జైపూర్