- ఎంఆర్ఓ ఆఫీస్‌లలో మామూళ్లకు తెర
- టీఆర్ఎస్ నేతల అండదండలతో అక్రమాలు?
జగిత్యాల, వెలుగు : జిల్లాలోని ఎమ్మార్వో ఆఫీసుల్లో కొందరు సిబ్బంది ధరణిలోని లొసుగులను ఆసరా చేసుకొని ప్రతి పనికో రేటు నిర్ణయించారు. రిజస్ట్రేషన్ల ప్రక్రియ, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, సంక్షేమ పథకాలతో పాటు మంజూరులో అందినంత దండుకుంటున్నారు. డబ్బులిస్తే ఇల్లీగల్ పని అయినా వెంటనే పూర్తి చేస్తున్నారని, లేకపోతే నిబంధనల పేరిట ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పైరవీల్లో టీఆర్ఎస్ నేతల ప్రమేయం..?
మండలంలోని రెవెన్యూ ఆఫీసర్ల బదిలీల్లో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని, అందుకే అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు లేవని రెవెన్యూ సిబ్బందే చెబుతున్నారు. గతంలో ఓ మంత్రి వద్ద పని చేసిన రెవెన్యూ ఆఫీసర్ సెక్రటేరియట్లో పని చేసే కీలక ఆఫీసర్ తో సన్నిహితుడినని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడని విమర్శలు ఉన్నాయి. ప్రోటోకాల్ బాధ్యతల నిర్వహణలో సమర్థుడిగా ఉన్నతాధికారుల దృష్టిలో స్థానం సాధించిన రెవెన్యూ ఆఫీసర్.. జగిత్యాల రెవెన్యూ ఆఫీస్ కేంద్రంగా పదేళ్లుగా తిష్ట వేసుకున్నాడు.
జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సుజాత అనే మహిళా రైతు తన సర్వే నంబర్ 108/ఈ/1లో 1.27 గుంటల ల్యాండ్ ను అదే మండలం మరో గ్రామానికి చెందిన పి. మహేశ్2022 జూలై 15న స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ లో ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ క్రమంలో మహేశ్‌కు లోన్ అవసరమై బ్యాంక్ కు వెళ్లగా 2022 మే 13న సుజాత కరీంనగర్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో రూ.5 లక్షల లోన్ తీసుకుని భూమిని బ్యాంక్ కు మార్టిగేజ్ చేసినట్లు తెలింది. బ్యాంక్ మార్టిగేజ్ లో ఉన్న ల్యాండ్ ను మామూళ్లు తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన లక్ష్మి గతేడాది తన కూతురు మహేశ్వరికి పెళ్లి చేసింది. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా, పెళ్లిరోజు నాటికి 18 ఏళ్ల ఒక్క రోజు మాత్రమే ఉందని, కల్యాణ లక్ష్మి సాంక్షన్ కావాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని ఓ రెవెన్యూ ఆఫీసర్ ఇంటికి వచ్చారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. గరీబోళ్లమని చెబితే రిజెక్ట్ చేశారని దీంతో ఆర్డీఓకు ఫిర్యాదు చేశానని బాధితురాలు చెబుతోంది.
మచ్చుకు మరికొన్ని:
1. ఓ రైతు భూమి ఎస్సారెస్పీ కింద పోయినట్లు ధరణి రికార్డులు తప్పుగా నమోదు కాగా కలెక్టర్ సిటిజన్ లాగన్ లో దరఖాస్తు చేశాడు. పరిశీలించి క్లియరెన్స్ చేయాల్సిన అధికారి రూ.40 వేలు లంచం తీసుకొని ఎస్సారెస్పీ ప్రొహిబిటెడ్ ల్యాండ్ గా ఉన్న భూమిని పట్టాదారు భూమిగా మార్చినట్లు సమాచారం.
2. మెట్పల్లి డివిజన్ లోని ఓ మండలానికి చెందిన రైతు కొత్త పాస్ బుక్ లో తనకున్న 1.24 గుంటల ల్యాండ్ నమోదు కోసం మూడు నెలల క్రితం అప్లై చేసుకోగా, ఎమ్మార్వో ఆఫీస్ లో పని చేసే అపరేటర్ రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా మందలించి వదిలేసినట్లు తెలుస్తోంది.
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
రెవెన్యూ పరిధిలో ఎవరైనా ఎమ్మార్వోలు, సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదు. బాధితులు ఎవరైనా నా దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- మాధురి, ఆర్డీఓ, జగిత్యాల