న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి చైనా చొరబడిందంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై నిర్వహించిన చర్చలో రాజ్నాథ్ మాట్లాడారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై రాహుల్ బాధ్యతారహిత రాజకీయాలకు పాల్పడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
‘‘చైనా బలగాలు మన భూభాగాల్లోకి చొరబడలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టం చేశారు. అయినా కూడా చైనా బలగాలు మన భూభాగాన్ని ఆక్రమించాయని రాహుల్ అన్నారు. ఆర్మీ చీఫ్ అనని మాటలను అన్నట్లుగా రాహుల్ తప్పుడు ప్రచారం చేశారు.
ఇండియా, చైనా సరిహద్దుల్లో బలగాలు ఉపసంహరించుకోవాలని ఇటీవలే ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఇరు దేశాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్నే జనరల్ ద్వివేదీ తెలిపారు. కానీ, మన దేశ భూభాగంలో చైనా బలగాలు ప్రవేశించాయంటూ రాహుల్ అబద్ధం చెప్పారు. బాధ్యత లేకుండా ఆయన ఇలా మాట్లాడడం దురదృష్టకరం” అని రాజ్ నాథ్ పేర్కొన్నారు.