
సిద్దిపేట, వెలుగు : యాసంగి సీజన్ లో రైతుల శ్రేయస్సు కోసం రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి రెండు కాల్వల ద్వారా నీరు విడుదల చేస్తున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుంచి కాలువల్లోకి మంత్రి నీరు విడుదల చేసి మాట్లాడారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి 1.10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రిజర్వాయర్ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు.
ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం పూర్తవడంతో ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలకు, కుడి కాలువ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఎడమ కాలువ ద్వారా సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాలకు, కుడి కాలువ ద్వారా సిద్దిపేట అర్బన్, నంగునూరు మండలాల్లోని చెక్ డ్యామ్ లు, చెరువులకు సాగునీరు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ హరిరామ్ తదితరులు పాల్గొన్నారు.