ఏసీబీ వలలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్​

ఏసీబీ వలలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్​
  • బిల్లులపై సంతకం చేయడానికి 15 వేల లంచం డిమాండ్​
  • రూ.6 వేలు తీసుకుంటూ పట్టుబడిన గుడికుంట తండా ఇరిగేషన్  ​ఏఈ 

హనుమకొండ, వెలుగు: పనులకు బిల్లులు చెల్లించడానికి లంచం డిమాండ్ చేసిన పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ​ఇరిగేషన్​ ఏఈ  ఏసీబీకి చిక్కాడు. మాజీ సర్పంచ్ ​నుంచి రూ.6 వేలు తీసుకుంటుండగా ఏసీబీ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంట తండా పంచాయతీకి బానోత్ ​యాకూబ్ రెండు సార్లు సర్పంచ్​గా పని చేశారు. పదవీకాలంలో బానోత్ ​యాకూబ్ పంచాయతీ ట్రాక్టర్ ​డీజిల్, ఇతర మెయింటెనెన్స్​ కోసం రూ.1.27 లక్షలు ఖర్చు చేశాడు. వాటికి సంబంధించిన బిల్లులు గ్రామ కార్యదర్శి తయారు చేయగా, పంచాయతీ స్పెషల్​ఆఫీసర్, ​ఇరిగేషన్ ​ఏఈ గుగులోత్ ​గోపాల్​ కౌంటర్ ​సిగ్నేచర్​ చేయాల్సి ఉంది. 

దీంతో యాకూబ్...గోపాల్​ను సంప్రదించగా సంతకం పెట్టడానికి రూ.15 వేలు డిమాండ్​ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని యాకూబ్ ​ఏసీబీని ఆశ్రయించాడు. ఏఈ గోపాల్​కు రూ.6 వేలు ఇచ్చేందుకు యాకూబ్ ​సోమవారం హనుమకొండకు వచ్చాడు. నక్కలగుట్ట ఎస్బీఐ వద్ద గోపాల్​కు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. గోపాల్​ను వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య తెలిపారు.