ఏసీబీ కస్టడీకి ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్..

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్‎ను ఏసీబీ కస్టడీకి తరలించారు ఏసీబీ అధికారులు. నాలుగు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ బుధవారం ( డిసెంబర్ 11, 2024 ) న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయటంతో ఇవాళ ( డిసెంబర్ 12, 2024 ) కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నిఖేష్ కుమార్‎ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు.

కాగా, హైదరాబాద్‎లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్‎లో పని చేస్తోన్న నిఖేష్ కుమార్ ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డిసెంబర్ 1న నిఖేష్ కుమార్ ఇంటితో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. 

Also Read:-హాజరు కాని కొండా సురేఖ.. నాగార్జున కేసు విచారణ వాయిదా..

తనిఖీలు నిర్వహించిన అధికారులకు కళ్ళు బైర్లు కమ్మేలా అవినీతి బయటపడింది..  నిఖేష్ కుమార్ ఏకంగా రూ.200 కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు అధికారులు. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఈ కేసుకు సంబంధించి నిఖేష్ కుమార్ నుండి మరిన్నీ వివరాలు రాబట్టాలని.. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు చేసిన విజ్ఞప్తి మేరకు కస్టడీకి 4రోజుల అనుమతిచ్చింది కోర్టు.