- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మేళ్లచెరువు/మఠంపల్లి, వెలుగు : పదేండ్లుగా ఆగిన అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో పరుగులు పెడుతుందని ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చివరి ప్రాంతాలైన చింతలపాలెం, మఠంపల్లి మండలాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. కొత్త మండలాలు ఏర్పాటై తొమ్మిదేండ్లు గడిచినా ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించలేదని చెప్పారు. చింతలపాలెం మండలంలో రూ.2.62 కోట్లతో తహసీల్దార్, రూ.2.98 కోట్లతో మండల పరిషత్, రూ.2.38 కోట్లతో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఫండ్స్ శాంక్షన్ చేయించానని తెలిపారు.
ధాన్యం, పత్తి కొనుగోళ్లలో సమస్యలుంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తారని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చింతలపాలెం మండలానికి వెళ్తూ వేపాలసింగారం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి సమయానికి లారీలు రాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే మంత్రి ఉత్తమ్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషినల్ ఎస్పీ నాగేశ్వర్ రావు, ఆర్డీవో శ్రీనివాసులు, ఆర్ అండ్ బీ ఎస్ఈ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ సురేందర్ రెడ్డి, ఎంపీవో భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.