సదర్​మాట్ అయితలే సాగునీరు వస్తలే.. ఫండ్స్​ అందక పూర్తికాని ప్రాజెక్ట్​

  •      బిల్లులు రావడం లేదని  లేట్​ చేస్తున్న కాంట్రాక్టర్​ 
  •       పూర్తయితే  రెండు జిల్లాల్లో 18 వేల ఎకరాలకు సాగు నీరు

నిర్మల్, వెలుగు: నిర్మల్, జగిత్యాల జిల్లాలో 18 వేల120 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న సదర్మాట్ పనులు పూర్తి కావడం లేదు. కిందటి ఏడాదే ప్రాజెక్ట్​ పూర్తి కావాల్సి ఉన్నా, బిల్లులు రాకపోవడంతో   లేట్​ అవుతున్నాయి. దీంతో అధికారులు  గడువును అధికారులుపెంచుతూ వస్తున్నారు. తాజాగా జూన్ 2023 లోగా పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. కానీ   పూర్తయ్యేలా కనిపించడం లేదు. 

ఐదేండ్లుగా  సాగుతున్నయ్​.. 

నిర్మల్, జగిత్యాల జిల్లాలకు సాగునీరు అందించాలని మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరి నదిపై ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 2018లో ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయి. పూర్తి చేయాల్సిన డెడ్​లైన్​ను ఇప్పటికే రెండు సార్లు పొడగించారు. అయినా పనులు కంప్లీట్​ కాకపోవడంతో మరోసారి గడువు పెంచారు. ఏప్రిల్, మే నెలల్లో గా పనులు పూర్తయితేనే ఆయకట్టుకు సాగునీరందే అవకాశాలు ఉన్నాయి. 

అందని బిల్లులు..

మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్​ పనులు పూర్తికావాలని అధికారులు అంటున్నారు. కానీ, వర్షాకాలం మొదలైతే ప్రాజెక్ట్​ పనులు ముందుకు సాగే పరిస్థితి ఉండదు. కాంట్రాక్టర్ కు ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించక పోవడమే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం గేట్ల బిల్లులకు ప్రభుత్వ గైడ్​లైన్స్​తో విభేదించిన కాంట్రాక్టర్ ఆ పనులను నిలిపివేశారు. మళ్లీ ఇరిగేషన్ అధికారుల హామీతో పనులు మొదలు పెట్టినా.. బిల్లుల సమయానికి అందకపోవడంతో జాప్యం జరుగుతూ వస్తోంది. 

కోట్లలో ఖర్చు.. 

నిర్మాణ   ఖర్చుతోపాటు భూసేకరణ కోసం రూ. 520 కోట్ల 39 లక్షల అంచనా వేశారు. ఇందులో నుంచి భూసేకరణ కోసం రూ. 199 కోట్ల కేటాయించారు. ఇప్పటివరకు రూ. 433 కోట్ల 88 లక్షలు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పనుల కోసం రూ. 328 కోట్ల 96లక్షలు, భూసేకరణ కోసం రూ. 104 కోట్ల 92 లక్షలను ఇప్పటికే ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్మల్ జిల్లా రైతులకు రూ. ఐదు కోట్ల 70 లక్షలు, జగిత్యాల జిల్లాకు చెందిన రైతులకు రూ. ఐదు కోట్ల 30 లక్షలను పరిహారం కింద ఇంకా చెల్లించాల్సి ఉంది. 

మోడ్రన్​ డిజైన్ తో 55 గేట్లు...

 ప్రాజెక్టు నిర్మాణాన్ని మాడ్రన్ డిజైన్ తో చేపడుతున్నారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు 55 గేట్లు ఉంటాయి. ఇప్పటికే గేట్లు పూర్తవగా.. మోటార్లు బిగింపు కోసం సిద్ధంగా ఉన్నాయి.   కిందటి ఏడాదే పనులను పూర్తి చేసి 18 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని భావించారు. నిర్మల్ జిల్లాలో 13 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లా లో 5 వేల ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పనులు మందకొడిగా సాగుతున్న కారణంగా ఈ రెండు జిల్లాల రైతులు ప్రాజెక్టు పనుల పూర్తి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

పనుల పూర్తికి చర్యలు...

సదర్ మాట్ పనులను జూన్ చివరిలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసు కుంటున్నాం. సాంకేతిక, క్షేత్రస్థాయి కారణాలవల్ల కొంతమేర  పనులు ఆలస్య మయ్యాయి.   గడువులోనే పనులన్నింటినీ పూర్తి చేసేందుకు   చర్యలు చేపడుతున్నాం. నిర్మల్ జిల్లాలో 13 వేలు, జగిత్యాల జిల్లాలో 5  వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదు.  - రామారావు,  ఈఈ, ఇరిగేషన్, నిర్మల్.