బీ జోన్ చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామన్న ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు

ఎల్లారెడ్డి,వెలుగు: పోచారం ప్రాజెక్ట్, బీ జోన్​పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తామని ఇరిగేషన్​డీఈ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం ఎల్లారెడ్డి ఎంపీడీవో ఆఫీస్​లో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. యాసంగి పంటలకు 1.368 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

డీఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు పంపు సెట్లు వాడొద్దని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అడవిలింగాల గ్రామ పరిధి దాటిన తర్వాత బోర్​సౌకర్యం, చెరువు పారకం లేని రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. బీ జోన్ పరిధిలోని గ్రామాలకు 4 తడులకు నీరందుతుందని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, జడ్పీటీసీ ఉషా గౌడ్, ఎంపీపీ మాధవి, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.