హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలు, వరదలతో నీటి పారుదల శాఖకు రూ.70.50 కోట్ల నష్టం వాటిల్లి నట్టు ప్రభుత్వానికి నివేదించారు. చెరువులు, కుంట లకు రూ.52 కోట్లు, గూడెం ఎత్తిపోతల పథకానికి రూ.10 కోట్లు, కడెం ప్రాజెక్టుకు రూ.8.50 కోట్ల మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు. 19 టెరిటోరియల్ చీఫ్ ఇంజనీర్ల పరిధిలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టు కాల్వలకు జరిగిన నష్టం వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ పరిధిలో అత్యధికంగా రూ.15.35 కోట్ల నష్టం జరిగినట్టు గుర్తించారు. జగిత్యాల సీఈ పరిధిలో రూ.9.30 కోట్లు, రామగుండంలో రూ.5 కోట్లు, ములుగులో రూ.3.85 కోట్లు, నిజామాబాద్‌లో రూ.3.75 కోట్లు, మంచిర్యాలలో రూ.3.05 కోట్లు, గజ్వేల్‌లో రూ.3 కోట్లు, కొత్తగూడెంలో రూ.2.05 కోట్లు, కామారెడ్డిలో రూ.2 కోట్లు, సంగారెడ్డిలో రూ.1.80 కోట్లు, హైదరాబాద్, వరంగల్‌లో రూ.75 లక్షల చొప్పున, కరీంనగర్‌లో రూ.45 లక్షలు, ఖమ్మం, నల్గొండలో రూ.25 లక్షల చొప్పున, మహబూబ్‌నగర్‌లో రూ.15 లక్షలు, నాగర్ కర్నూల్, సూర్యాపేటలో రూ.10 లక్షల చొప్పున, వనపర్తి సీఈ పరిధిలో రూ.5 లక్షల మేర నష్టం జరిగిందని నివేదించారు. 196 చెరువుల కట్టలు తెగిపోగా, 79 చెరువుల మత్తడి, తూములు దెబ్బతిన్నాయి. 279 పంట కాల్వలు తెగిపోయాయి. ప్రాజెక్టు కాల్వలు 116 తెగిపోగా, మరో వంద కాల్వలకు నష్టం జరిగిందని గుర్తించారు.
కాళేశ్వరం పంపు హౌస్‌లపై గప్ చుప్
భారీ వర్షాలకు తోడు మెయింటనెన్స్ లోపాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన పంపుహౌస్ కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్‌లు నీటిలో మునిగిపోయాయి. అన్నారం పంపుహౌస్‌లో పెద్దగా నష్టం వాటిళ్లలేదని ఇంజనీర్లు చెప్తున్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌కు జరిగిన నష్టంపై నోరు మెదపడం లేదు. వందల కోట్ల నష్టం జరగలేదని, పంపుహౌస్‌ల మెయింటనెన్స్ చూస్తున్న సంస్థనే రిపేర్లు చేసి ఇస్తుందని గతంలో ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ వెల్లడించారు. మొత్తంగా ఎంత నష్టం జరిగింది, ఎప్పట్లోగా పంపుహౌస్ అందుబాటులోకి వస్తుందనే ప్రశ్నలకు అధికారులు, ఇంజనీర్లు సమాధానం చెప్పడం లేదు. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ కాళేశ్వరం ఎత్తిపోతల నష్టంపై ఎలాంటి ప్రస్తావన లేదు.