- భద్రాచలంలో ఇరిగేషన్ ఇంజినీర్ల సూపర్వైజేషన్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి కరకట్టపై స్లూయిజ్‌ల వద్ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఎక్కడి నుంచైనా కరకట్టను ఈ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. భారీ వర్షాలతో వేగంగా ఊరిన డ్రైన్‌వాటర్ మొత్తం రామాలయం వద్ద ఉన్న విస్తా కాంప్లెక్స్ సమీపాన ఉన్న స్లూయిజ్‌కు చేరుకుంటుంది.
మోటార్లు సకాలంలో ఆన్ చేయకపోతే ఆ నీరు రామాలయం పరిసరాలను ముంచెత్తుతుంది. అర నిముషం ఆలస్యమైనా ముప్పు ముంచుకొస్తుంది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని పరిశీలించి స్టాఫ్‌ను అలర్ట్ చేయడానికి వీలుంది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఎప్పటికప్పుడు తమకు తెలిసేలా ఇరిగేషన్ ఈఈ, ఇతర సిబ్బంది సెల్ ఫోన్లకు వాటిని అనుసంధానం చేశారు.
ఆ రెండే కీలకం..
1998లో గోదావరి వరదల నుంచి భద్రాచలం టౌన్‌ను కాపాడేందుకు రూ.15కోట్ల వ్యయంతో కరకట్టలు నిర్మించారు. కూనవరం రోడ్డు నుంచి ఎటపాక వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ కట్టలు పోశారు. ఊరిలోని డ్రైన్ వాటర్ బయటకు పంపేందుకు కరకట్టలపై సుభాష్ నగర్ కాలనీ, విస్తాకాంప్లెక్స్, అశోక్‌నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో స్లూయిజ్‌లను నిర్మించారు. వీటిలో ప్రధానంగా విస్తా కాంప్లెక్స్, అశోక్‌నగర్ కొత్త కాలనీ స్లూయిజ్లతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
గోదావరి ఉప్పొంగగానే స్లూయిజ్ గేట్లను మూసేస్తారు. దీనివల్ల ఊరిలో పడిన వర్షపు నీరు అంతా డ్రైన్ల ద్వారా ఇక్కడకు చేరుకుని ఆ ప్రాంతమంతా విస్తరిస్తుంది. ఆ నీటిని మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ ఇంజినీర్లు గోదావరిలోకి ఎత్తిపోస్తుంటారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాలనీలను బ్యాక్ వాటర్ ముంచెత్తుతుంది.
ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైన విస్తాకాంప్లెక్స్, అశోక్‌నగర్ కొత్తకాలనీ స్లూయిజ్‌లను మానిటరింగ్ చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సెల్ఫోన్లలోనే ఈ స్లూయిజ్‌ల పరిస్థితిని సీసీ కెమెరాల పుటేజీ ద్వారా విశ్లేషించుకుంటున్నారు. మోటార్ల వద్ద ఉండే స్టాఫ్‌ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు.
నిరంతరం మానిటరింగ్..
స్లూయిజ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎక్కడ ఉన్నా సెల్ఫోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నాం. మోటార్లను రెడీ చేసి పెట్టుకున్నాం. ఏ క్షణమైనా వాటిని ఆన్ చేసేలా స్లూయిజ్‌ల వద్ద ఉన్న స్టాఫ్‌కు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తాం. డ్రైన్ల ద్వారా వచ్చే నీటిని బట్టి మోటార్లను ఆన్ చేసి గోదావరిలోకి పంపింగ్ చేస్తున్నాం.- రాంప్రసాద్, ఈఈ, ఇరిగేషన్, భద్రాచలం