ఏఈఈలకు ప్రాజెక్టుల బాధ్యతలు

  • చెరువులు, చెక్ డ్యామ్​లు మరింత మెరుగ్గా నిర్వహించడంపై విధుల కేటాయింపు
  • ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ సర్క్యులర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, చెక్​డ్యామ్​లను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ఏఈఈలు, ఏఈలకు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ విధులను నిర్వచించింది. జాబ్​లో చేరిన తొలినాళ్లలోనే ఏఈఈలు, ఏఈలకు వివిధ అంశాలపై పట్టు ఉండేలా విధులను అప్పగించాలని పేర్కొంది. విభాగంలోని సివిల్/మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్​కు సంబంధించిన అధికారులు ఏమేం చేయాలో సూచిస్తూ ఇటీవల సర్క్యులర్​ను జారీ చేసింది. మొదటి నుంచే ఇలాంటి పనులను అప్పగించడం ద్వారా ఇరిగేషన్​ ప్రాజెక్టులను సేఫ్​గా, మరింత మెరుగ్గా నిర్వహించేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. 

ఏఈఈ/ఏఈ సివిల్​ విధులివీ..

ప్రధాన ప్రాజెక్టులు, లిఫ్ట్​ స్కీమ్స్, ప్రెషర్​ మెయిన్స్, డ్యాములు, కాలువలకు సంబంధించిన డిజైన్స్, అంచనా, ఎగ్జిక్యూషన్, క్వాలిటీ కంట్రోల్, నీటి నియంత్రణ,  ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్  చేయాలి. డిపార్ట్​మెంట్​లో పనిచేసే ఏఈఈ ఐఎస్​ కోడ్స్/మ్యానువల్స్​ ప్రకారం డిజైన్స్​ చేయాలి.

డ్రాయింగ్స్, స్పెసిఫికేషన్ ​కు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనాలను తయారు చేయాలి. ప్రాజెక్టుల్లో వాడే సామగ్రి, గేట్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించి ఫీల్డ్​ టెస్టులు చేయాలి. అన్నింటి రికార్డులను మెయింటెయిన్​ చేయాలి. ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతంలో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలి. భూసేకరణ చేయాలి.

అటవీ అనుమతులు, డీపీఆర్​ తయారీ వంటి వాటినీ చూసుకోవాలి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనుల పురోగతిపై  ఎప్పటికప్పుడు రిపోర్టు ఇవ్వాలి. డ్యాముల గేట్లు, కాల్వల హెడ్​ రెగ్యులేటర్, క్రాస్​ రెగ్యులేటర్ ​ గేట్లు, షట్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. నేషనల్​ డ్యామ్  సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) నిబంధనలకు అనుగుణంగా డ్యాములు, ప్రాజెక్టుల భద్రతకు సంబంధించిన రికార్డులు నిర్వహించాలి. చెరువులు, చిన్న లిఫ్టు స్కీములు, కాల్వలకు సంబంధించి ఏఈలు అవే విధులు నిర్వర్తించాలి.

పంప్​హౌస్​లను పర్యవేక్షించాలి

లిఫ్ట్  స్కీములకు సంబంధించిన ఎలక్ట్రికల్​ సంబంధిత పనుల బాధ్యతలను సంబంధిత ఏఈఈలు చూసుకోవాలి. పంప్​హౌస్​లు, మోటార్లు, సబ్​స్టేషన్లు, ఇతర పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. పంప్​హౌస్​లు, రిపేర్లు, డ్యామేజీలకు సంబంధించిన అంశాలపై సివిల్, మెకానికల్, ట్రాన్స్​కో అధికారులతో  ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. వ్యవసాయానికి సంబంధించి ఆయకట్టులో పంటల దిగుబడిపై స్టడీ చేయాలి. గ్రామాలు, పంచాయతీల్లో సాయిల్ ​ సాంపిళ్లను సేకరించి సారాన్ని చెక్​ చేయాలి. వివిధ వ్యవసాయ పద్ధతుల ద్వారా నీటిని సమగ్రంగా వాడుకునేలా కొత్త విధానాలను రూపొందించాలి.