
భద్రాచలం : గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం (జులై 28) రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో(చివరి) ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 14,32,336 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలంతో పాటు లోతట్టు గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 49 పునరావాస కేంద్రాలకు 4 వేల 900 మందిని తరలించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించాయి.
గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం మొత్తం వరదనీటిలో మునిగింది. గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, ముంపు మండలాలైన కోనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటిమట్టం 56 నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు.