పెద్దవాగు గండిపై  ఆఫీసర్లకు మెమో

పెద్దవాగు గండిపై  ఆఫీసర్లకు మెమో
  • 12 గంటలకే గేట్లు ఎత్తాలని ఎస్​ఈ ఆదేశించినా 2.30 గంటలు వరకు ఎత్తలే.. 
  • మూడో గేట్ ​ఎత్తడంలో ఇబ్బంది ఉన్నా ఇన్​టైంలో ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లలే..
  •  ఈఈ, డీఈ, జేఈ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల ఆగ్రహం
  • వరదతో నష్టపోయిన వివరాల్ని సీఎంకు వివరించిన మంత్రి తుమ్మల 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని అశ్వారావుపేట మండలంలోని పెద్ద వాగు ప్రాజెక్టు గండి పడడంలో ఇరిగేషన్​ ఆఫీసర్ల నిర్లక్ష్యంపై ఆ శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ విషయమై ఇరిగేషన్​ శాఖ ఉన్నతాధికారులు ప్రాజెక్టును పర్యవేక్షించే ఈఈ, డీఈ, జేఈలకు శుక్రవారం రాత్రి మెమోలు ఇచ్చారు. వరద ఉధృతి నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు గేట్లు ఓపెన్​ చేయాలని ఎస్​ఈ ఆదేశించినప్పటికీ అక్కడున్న ఇరిగేషన్​ అధికారులు మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎత్తలేదు.

మూడో గేట్​ ఎత్తడంలో తలెత్తిన ఇబ్బందిని కనీసం ఎస్ఈ దృష్టికి ఇన్​టైంలో తీసుకెళ్లలేదు. దీనిపై ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి సమీక్షించారు. ఈ క్రమంలోనే ఫ్లడ్ ​మానిటరింగ్​చేయకపోవడం, వరద పరిస్థితిని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వకపోవడం లాంటి పలు అంశాలపై ఈఈ సురేశ్, డీఈ ఎన్​.కృష్ణ,  జేసీ కృష్ణకు మెమోలను జారీ చేశారు. ఆఫీసర్ల పనితీరుపై కలెక్టర్​ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

నష్ట పోయిన రైతులను ఆదుకుంటాం : మంత్రి

పెద్ద వాగు ప్రాజెక్ట్​కు గండి పడడంతో ఆస్తి, పంట నష్టపోయినవారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితుల వివరాలు సేకరించాలని కలెక్టర్​ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. నష్టం వివరాలను సీఎం రేవంత్​ రెడ్డికి వివరించినట్టు తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం ఇన్​ఫుట్​ సబ్సిడీపై ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్​ రిపేర్ల కోసం ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం నిర్వహించి కార్యాచరణ చేపడుతామని తెలిపారు. పెద్ద వాగు ప్రాజెక్ట్​కు రిపేర్లు చేపట్టే విషయంలో తెలంగాణ, ఏపీలోని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని పేర్కొన్నారు. 

నష్టపరిహారం చెల్లించాలి : బీజేపీ 

అశ్వారావుపేట : పెద్దవాగు ప్రాజెక్ట్ వరద ప్రవాహ దాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన అశ్వారావుపేట మండలం నారాయణపురంలో పంట పొలాలలో వేసిన ఇసుకమేటలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. అనంతరం  రైతులతో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సెల్ ఫోన్ లో మాట్లాడించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ రైతుల పంట పొలాలలో పేరుకుపోయిన ఇసుక మేటలను తీయించే ఏర్పాట్లను ప్రభుత్వమే చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్లు, బండారు చంద్రశేఖర్, మాలోతు గాంధీ, గొట్టాపు వెంకట అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. 

కొత్తగూడెం ఆర్డీవో పరిశీలన

అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలం గుమ్మడపల్లి వరద ప్రభావిత ప్రాంతాలను, ప్రాజెక్టును కొత్తగూడెం ఆర్డీవో మధు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల్లో పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు 44, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు  21, కచ్చా ఇల్లు 3 పశువుల కొట్టాలు 42గా గుర్తించామని తెలిపారు. పూర్తిగా దెబ్బతిన్న గుడిసెలకు రూ .4,100,  పాక్షికంగా దెబ్బతిన్న పక్కా గృహాలకు రూ .5,200, కచ్చా ఇళ్లకు రూ.3,200, పశువుల కొట్టాలకు రూ.2,100 ప్రభుత్వ ఆదేశాల మేరకు నష్టపరిహారం కింద మొత్తం రూ.3,94,700  నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పెద్దవాగు ప్రాజెక్టు వరద బాధితులకు గుమ్మడపల్లి ప్రభుత్వ పాఠశాలలో పునరావాసం కల్పించి భోజన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ ఉన్నారు. 

బాధితులకు దుప్పట్లు పంపిణీ 

అశ్వారావుపేట : పెద్దవాగు ప్రాజెక్ట్ గండిపడి వరద బారిన పడి నష్టపోయిన గుమ్మడపల్లి గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపల్లి రమేశ్​ఆధ్వర్యంలో శనివారం 200 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు అధైర్య పడొద్దని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నండ్రు రమేశ్, జూపల్లి ప్రమోద్, చెన్నారెడ్డి, తిరుపతిరావు, సత్తిబాబు పాల్గొన్నారు.