
హైదరాబాద్, వెలుగు: గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ)కి ఇరిగేషన్ శాఖ అధికారులు లేఖ రాశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సాగర్ కుడి కాల్వను వెడల్పు చేసి.. ఇంట్రా లింకింగ్ కింద ఆ ప్రాజెక్టును చేపడుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దానిని వ్యతిరేకిస్తున్నది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును తెప్పించాలని జీఆర్‌ఎంబీకి లేఖ రాసినట్టు తెలిసింది.
అలాగే, సమ్మక్క సారక్క బ్యారేజీకి సంబంధించి చత్తీస్‌గఢ్‌తో ఎన్‌వోసీపైనా లేఖ రాసినట్టు సమాచారం. దాంతో పాటు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణలో ముంపు సమస్య ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలు సంయుక్తంగా సర్వే చేపట్టాలని నిర్ణయించినా ఆలస్యమైంది. ఈ క్రమంలోనే దానిపై ఐఐటీ హైదరాబాద్‌తో సమగ్ర స్టడీ చేయించాలని అధికారులను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనిపైనా బోర్డుకు లేఖ రాసినట్టు సమాచారం. ఈ మూడు లేఖలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్టు తెలిసింది.