
- ఫిబ్రవరి నెలాఖరుకే ఇస్తామన్న ప్రభుత్వం
- తొలుత ఎస్ఈ, సీఈ స్థాయి అధికారులకే
- ఇప్పటికీ దానిపైనా తేల్చని సర్కారు
- త్వరగా ప్రమోషన్లు చేపట్టాలని అధికారుల విజ్ఞప్తులు
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లు ఆలస్యం అవుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోపు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించినా.. అది నెరవేరడం లేదు. దశాబ్దాలుగా ప్రమోషన్ల కోసం వేచి చూసిన అధికారులు.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ప్రమోషన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అయితే, అందుకు అనుగుణంగా ఇరిగేషన్ శాఖ సలహాదారు, సెక్రటరీలు, ఈఎన్సీలతో ప్రభుత్వం జనవరిలో ఫైవ్ మెన్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లపై స్టడీ చేసి అర్హుల జాబితాను సిద్ధం చేసింది. తొలి దశలో ఎస్ఈల నుంచి సీఈలు, సీఈల నుంచి ఈఎన్సీలకు ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు సార్లు డిపార్ట్మెంటల్ ప్రమోషనల్ కమిటీ(డీపీసీ) సమావేశాలనూ నిర్వహించారు. అయితే, దాని మీద ఇప్పటివరకూ తేల్చలేదు. అర్హులను కాదని, అనర్హులను ప్రమోషన్ల జాబితాలో చేర్చారంటూ కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకూ రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఇన్నాళ్లూ కోర్టులో జోన్ 5, జోన్ 6 అంశంపై వివాదం నడిచిందని, ఇప్పుడు ఆ వివాదం సద్దుమణిగినా ప్రమోషన్లు ఎందుకు లేట్ చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
ఏఈఈల అసంతృప్తి..
ప్రమోషన్ల విషయంలో ఏఈఈలు, డీఈఈ, ఈఈ స్థాయి అధికారులను పరిగణనలోకి తీసుకోకపోవడంతో కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ప్రమోషన్లు లేక వేచి చూస్తున్నామని, ఒకే దశలో అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని అంటున్నారు. ఇప్పటికే17 ఏండ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న 2008 బ్యాచ్ ఏఈఈలు.. తమకు ప్రమోషన్లు ఇవ్వకపోతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జోనల్ ఇష్యూ పేరు చెప్పి ప్రమోషన్లను ఆపుతున్నారని, 17 ఏండ్లుగా అన్యాయానికి గురవుతున్నామని, ఇకనైనా తమకు ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు వారు వినతి పత్రాలను సమర్పించారు. ఆ బ్యాచ్లో ప్రమోషన్లు లేక చాలా మంది రిటైర్మెంట్ దగ్గరకు వచ్చారని చెబుతున్నారు. ఇటు డీఈఈ, ఈఈ స్థాయి అధికారులకు కూడా వెంటనే ప్రమోషన్లు కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.