
- ఇప్పటికే పంటలకు అందిన నాలుగు తడులు
- మరో రెండు విడతల నీటి విడుదలకు ప్లాన్
- పంట చేతికిరానున్నదని ఆన్నదాతల ఆనందం
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో యాసంగి సాగు గట్టెక్కనున్నది. నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని అందించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే వరి పంటకు నాలుగు తడులను అందించగా, మరో రెండు విడతలు నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. ఎండ తీవ్రతతో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గుతున్నా వరి పంట పొట్ట దశ ఉన్నందున నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 3 లక్షల 97 వేల ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. ఇందులో 2 లక్షల 65వేల ఎకరాల్లో వరి సాగైంది. మిగతా ఏరియాల కంటే బాన్సువాడ ఏరియాలో ముందుగా నాట్లు వేయడం వల్ల మరో 15 రోజుల్లో కోతలు షూరు కానున్నాయి. ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు ఇటీవల ఉన్నతాధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి పంటకు నీరు ఎంత అవసరమో క్షేత్రస్థాయిలో పరిశీలించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు..
నిజాంసాగర్ ప్రాజెక్టు కెపాసిటీ 17. 802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.06 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఆయకట్టుకు 6 విడతల్లో నీళ్లు వదలాలని నిర్ణయించగా ఇప్పటికే 4 విడతలు వదిలారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కలిపి ఈ ప్రాజెక్టు కింద లక్షా24 వేల ఎకరాల్లో వరి సాగైంది. బాన్సువాడ నియోజకవర్గంలో 85 వేల ఎకరాలు, బోధన్ నియోజకవర్గంలో 29వేల ఎకరాలు ఉంది. బాన్సువాడ, బీర్కుర్, నస్రుల్లాబాద్ మండలాల్లో మరో 10 రోజులు, 15 రోజుల్లో వరి పంట కోతకు వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఐదో విడత నీటిని కూడా విడుదల చేశారు.
పోచారం ప్రాజెక్టు..
పోచారం ప్రాజెక్టు కెపాసీటీ 1.81 టీఎసీంలు కాగా, ప్రస్తుతం 0. 6 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో 10 వేల ఎకరాల వరి సాగైంది. ఇప్పటికే నాలుగు విడతలు నీటిని విడుదల చేశారు. మరో రెండు విడతలు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మండలాల్లో బోర్ల కింద వేసిన వరి పొలాలు ఎండి బీటలువారుతున్నాయి. ప్రాజెక్టు కింద ఆయకట్టు పొలాలు పొట్ట దశలో ఉన్నాయి. మరో 20 రోజులు దాటితే పంట రైతుల చేతికి రానున్నది. కౌలాస్నాలా కింద ఉన్న 2 వేల ఎకరాల ఆయకట్టుకు కూడా నీళ్లు అందనున్నాయి.
ప్రాజెక్టుల కింద పంటలకు ఇబ్బంది లేదు..
జిల్లాలో ప్రాజెక్టుల కింద ఆయకట్టు పంటలకు సాగునీటి ఇబ్బంది లేదు. ఇప్పటికే రెండు ప్రాజెక్టుల నుంచి నాలుగు విడతలు నీటిని విడుదల చేశాం. మరో 2 విడతలు నీటిని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఇంకా ఒక్క తడి అందితే పంట చేతికొస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
శ్రీనివాస్, సీఈ, ఇరిగేషన్ శాఖ కామారెడ్డి జిల్లా