- ప్రాజెక్టుకు వచ్చే వరదను అంచనా వేసేందుకు ప్రత్యేక వ్యవస్థ
- బ్యారేజీల సేఫ్టీకి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఏర్పాటు
- ముంపు సమస్య పరిష్కారానికి ఇరిగేషన్ శాఖ యోచన
- ఈ రెండింటి ఆధారంగా గేట్ల ఆపరేషన్ ప్రొటోకాల్
- ఇరిగేషన్ అధికారులకు వస్సార్ ల్యాబ్స్ ప్రజంటేషన్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుతో తలెత్తుతున్న ముంపు సమస్యను పరిష్కరించేందుకు ఇరిగేషన్ శాఖ నడుం బిగించింది. ఫ్లడ్ సీజన్ లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వరదతో మంథని, పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాచలం సహా దాదాపు 40 ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. దీన్ని నివారించేందుకు రిటెయినింగ్ వాల్ నిర్మించాలని భావిస్తున్న ఇరిగేషన్ శాఖ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ‘ఫ్లడ్ రూటింగ్’ కూడా చేయాలని యోచిస్తున్నది.
బ్యారేజీల వద్ద ‘డ్యామ్ మానిటరింగ్ అండ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్’ కూడా ఏర్పాటు చేసి వరదను నియంత్రించాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఫ్లడ్ రూటింగ్ మీద అధికారులు దృష్టి సారించారు. దీనిపై గురువారం వస్సార్ ల్యాబ్స్అనే సంస్థ ప్రజంటేషన్ ఇచ్చింది. బ్యారేజీల గేట్ల ఆపరేషన్ ప్రొటోకాల్‌పై అధికారులకు వివరించింది.
ఫ్లడ్ రూటింగ్మీద వచ్చే వారం అన్ని వివరాలతో సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. కాగా, ముంపు లేకుండా చేసేందుకు గేట్ ఆపరేషన్ ప్రొటోకాల్ రూల్ కర్వ్స్ గురించి కూడా ఆరా తీసినట్టు తెలిసింది.
డెసిషన్ సపోర్ట్ సిస్టమ్‌తో సేఫ్టీ..
నిజానికి మేడిగడ్డ బ్యారేజీని 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించారని అధికారులు చెబుతున్నారు. కానీ బ్యారేజీ కుంగినప్పుడు అక్కడ వచ్చిన వరద 13 లక్షల క్యూసెక్కులేనని అంటుంటారు. తక్కువ వరద వచ్చినా బ్యారేజీ కుంగడానికి కారణం సరైన మానిటరింగ్వ్యవస్థ లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు.
ఇకపై అలా జరగకుండా బ్యారేజీల భద్రత, ఫ్లడ్ అసెస్మెంట్ కోసం డెసిషన్ సపోర్ట్సిస్టమ్ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇది కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ. బ్యారేజీల వద్ద దీని కోసం ఓ పెద్ద నెట్ వర్క్ నే ఏర్పాటు చేస్తారు. వాతావరణం ఎలా ఉందో తెలుసుకునేందుకు వెదర్ స్టేషన్, వాటర్ లెవెల్‌ను ఎప్పటికప్పుడు మెజర్ చేసే సిస్టమ్, అలల తీవ్రత, వస్తున్న వరద, వరద వల్ల బ్యారేజీ మీద పడుతున్న ఒత్తిడి, భూమిలో పరిస్థితులు (సీస్మిక్అసెస్మెంట్) సహా ప్రతి విషయాన్నీ ఈ డెసిషన్సపోర్ట్సిస్టమ్అంచనా వేస్తుంది.
దాని ప్రకారం.. ఎప్పుడు ఏం చేయాలో ప్రతి చిన్న డేటానూ వాటికి అనుసంధానించిన కంప్యూటర్ వ్యవస్థకు పంపిస్తుంది. ఈ డేటా ఆధారంగా డ్యామ్ లేదా బ్యారేజీ గేట్ల ఆపరేషన్‌ను నిర్వహిస్తారు. వస్తున్న వరద వల్ల డ్యామ్ లేదా బ్యారేజీలకు ముప్పు ఉన్నట్టు తెలిస్తే ఈ సిస్టమ్ వెంటనే అలర్ట్చేస్తుంది. దానికి అనుగుణంగా అధికారులు సరైన సమయంలో చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది.
ఈ నేపథ్యంలోనే ఫ్లడ్రూటింగ్, డెసిషన్సపోర్ట్సిస్టమ్ ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు రక్షణ కల్పించాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. అదే విధంగా ముంపు సమస్యకు పరిష్కారం చూపించాలని భావిస్తున్నది.
ఏంటీ ఫ్లడ్ రూటింగ్?
బ్యారేజీలకు ఎగువ నుంచి వచ్చే వరద ఒక్కోసారి తక్కువ రావొచ్చు.. ఒక్కోసారి భారీగా రావొచ్చు. దీన్ని అంచనా వేసే ప్రక్రియనే ఫ్లడ్రూటింగ్ అంటారు. ఇంకా చెప్పాలంటే.. ఏ టైమ్‌లో ఎంతెంత వరద వస్తున్నది? ఆ వరద ఎంత వేగంతో వస్తున్నది? ఎంత మేర వ్యాపించి (వెడల్పు) ఉంది? అన్న విషయాలను ఈ ఫ్లడ్ రూటింగ్ద్వారా విశ్లేషిస్తారు.
వివిధ సమయాల్లో వచ్చిన వరదల ఆధారంగా ఫ్లడ్రూటింగ్పై ఓ అంచనాకు వస్తారు. ఈ అంచనా ద్వారానే బ్యారేజీ లేదా డ్యాముల గేట్లను ఆపరేట్ చేస్తుంటారు. ఈ ఫ్లడ్ రూటింగ్ అంచనాల ద్వారా గేట్ ప్రొటోకాల్స్‌పై రూల్కర్వ్స్రూపొందిస్తారు. ఎంత వరద వస్తే ఎన్ని గేట్లు ఎంత మేర ఎత్తాలనే దానిపై అంచనాకు వస్తారు.