డ్రోన్లతో డ్యామ్​ల పర్యవేక్షణ: ఇరిగేషన్ శాఖ నిర్ణయం..

డ్రోన్లతో డ్యామ్​ల పర్యవేక్షణ: ఇరిగేషన్ శాఖ నిర్ణయం..
  • రేపు జల సౌధలో వర్క్​షాప్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్యాముల సేఫ్టీపై ఇరిగేషన్ శాఖ దృష్టి సారించింది. పకడ్బందీ రక్షణ చర్యలు చేపట్టనున్నది. ఇప్పటికే డ్యాములకు ఓనర్లను నిర్ణయించి వాటి పూర్తి బాధ్యతలను ఆయా అధికారులకే అప్పగించిన ఇరిగేషన్​ శాఖ.. వాటిని పర్యవేక్షించేందుకు డ్రోన్లను వినియోగించుకోవాలని యోచిస్తున్నది. వరద నియంత్రణ, ప్రాజెక్టుల డ్యామేజీల గుర్తింపు, గేట్ల నిర్వహణ, ప్రాజెక్టుల్లో లోపాలను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నది. 

ఈ నేపథ్యంలోనే బుధవారం జలసౌధలో డ్యామ్ సేఫ్టీ, నీటి యాజమాన్యంలో డ్రోన్ల వినియోగంపై ఒక రోజు వర్క్​షాప్ నిర్వహించనున్నది. ఈ వర్క్​షాప్​లో భాగంగా డ్యాముల డేటా ప్రాసెసింగ్​, ప్రాజెక్టుల్లో డ్రోన్ల టెక్నాలజీ తదితర అంశాలపై చర్చించనున్నారు. డ్యామ్ ఆపరేషన్లలో డ్రోన్లను వినియోగించే తీరును వివరించనున్నారు. 

ప్రాజెక్టు ప్రాంతాల స్థితిగతులను తెలుసుకోవడం, ప్రాజెక్టు ఏరియాల కబ్జా/ఆక్రమణలు, ప్రాజెక్టుల పరిశీలన వంటి వాటి గురించి తెలియజేయనున్నారు. ప్రాజెక్టుల్లో ఎంత మేర ఇసుక ఉందన్న విషయాన్ని అంచనా వేయనున్నారు. ప్రాజెక్టుల్లోని రాతి నిర్మాణాలు, డ్యామేజ్​లు తెలుసుకుని వాటి డేటాను డ్రోన్ల ద్వారా ఎలా ప్రాసెస్​ చేస్తారన్న విషయాలను చర్చించనున్నారు. వర్క్​షాప్​లో డ్రోన్లను ప్రదర్శించనున్నారు.