ప్రైవేట్​కు ఇరిగేషన్ గెస్ట్ హౌస్​లు!

  • మొదటి విడతలో ఏడు.. 
  • అప్ గ్రెడేషన్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ పద్ధతిలో అప్పగింత 
  • నోటిఫికేషన్ జారీ చేసిన టూరిజం శాఖ
  • టెండర్ దక్కించుకున్నోళ్లకు 15 ఏండ్ల వరకు లైసెన్స్

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్న గెస్ట్ హౌస్ లను ప్రైవేట్ డెవలపర్లకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతలో ఇరిగేషన్ శాఖ ఏడు గెస్ట్ హౌస్ లను టూరిజం డిపార్ట్ మెంట్ కు అప్పగించింది. దీంతో వాటిని అభివృద్ధి చేసి, మెయింటెయిన్ చేసేందుకు ఆసక్తి ఉన్న వ్యక్తుల నుంచి టెండర్లు కోరుతూ టూరిజం శాఖ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

టెండర్లు దక్కించుకున్న డెవలపర్లు ఈ గెస్ట్​హౌస్ లను త్రీ స్టార్ హోటల్, ఆ పై స్థాయిలో డెవలప్ చేసి, కేంద్ర టూరిజం శాఖ ప్రమాణాలకు అనుగుణంగా 12 నెలల్లోగా సౌకర్యాలు కల్పించి వారే సొంతంగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అంతేగాక నిర్వాహకులు టూరిజం శాఖ నిర్ణయించిన ధరల ప్రకారం ప్రతి ఏటా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న బిడ్డర్లు గెస్ట్ హౌస్ లను అప్ గ్రెడేషన్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ పద్ధతిలో నిర్వహించేందుకు 15 ఏండ్ల పాటు లైసెన్స్ ఇవ్వనున్నారు. 

రూమ్స్​, బార్లు, రెస్టారెంట్లు, గార్డెన్లుగా...

మొదటి విడతలో అప్ గ్రేడ్ చేయబోయే గెస్ట్ హౌసుల్లో ఆదిలాబాద్ లోని పెన్ గంగ గెస్ట్ హౌస్(2.34 ఎకరాలు), నిర్మల్ జిల్లాలోని కడెం సర్క్యూట్ హౌస్(6.16 ఎకరాలు), జగిత్యాల పట్టణ కేంద్రంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్(ప్రాజెక్ట్ హౌస్ 2.38), మెదక్ జిల్లా పోచారంలోని ఐబీ గెస్ట్ హౌస్(12.20), మహబూబ్ నగర్ జిల్లా బొల్లారంలోని కోయిల్ సాగర్ లోని గెస్ట్ హౌస్(9.25), నల్లగొండ జిల్లా డిండిలోని డిండి బాపెనకుంట గెస్ట్ హౌస్(9 ఎకరాలు), నిజామాబాద్ జిల్లా ఎస్ఆర్ఎస్పీ పోచంపాడు ప్రాజెక్ట్ హౌస్(17.20 ఎకరాలు) ఉన్నాయి. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ప్రకారం టెండర్ దక్కించుకున్న డెవలపర్లు..ఆదిలాబాద్ లోని పెన్ గంగ గెస్ట్ హౌస్, జగిత్యాల టౌన్ లోని ప్రాజెక్ట్ హౌస్ కు రూ.14.40 కోట్ల చొప్పున వెచ్చించి 50 రూమ్స్, కనీసం 500 మంది కూర్చోగలిగే కాన్ఫరెన్స్ హాల్, 100 కెపాసిటీ కలిగిన రెస్టారెంట్, 50 మంది సామర్థ్యంతో బార్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్ లకు కనీసం ఏటా రూ.10.52 లక్షల చొప్పున టూరిజం శాఖకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

కడెం సర్క్యూట్ హౌస్, కోయిల్ సాగర్ గెస్ట్ హౌస్, డిండి బాపెనకుంట గెస్ట్ హౌస్, పోచంపాడు ప్రాజెక్ట్ హౌస్ కు రూ.8.70 కోట్ల చొప్పున వెచ్చించి 25 రూమ్ లు, 500 మంది కెపాసిటీతో బాంక్వెట్​హాల్​,50 మందితో కూర్చోగలిగే రెస్టారెంట్ నిర్మించాల్సి ఉంటుంది. అలాగే కడెం సర్క్యూట్ హౌస్ మినహా మిగతా మూడు గెస్ట్ హౌసుల్లో వాటర్ స్పోర్ట్స్, థీమ్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ల్యాండ్ స్కేప్ గార్డెన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మెదక్ లోని ఐబీ గెస్ట్ హౌస్ లో రూ.11.10 కోట్లతో 30 రూమ్ లు, కనీసం 500 మంది కూర్చోగలిగే కాన్ఫరెన్స్ హాల్, 100 కెపాసిటీ కలిగిన రెస్టారెంట్ ను, 3000 చదరపు అడుగుల్లో  ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలి. వాటర్ స్పోర్ట్స్, థీమ్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ల్యాండ్ స్కేప్ గార్డెన్లను కూడా డెవలప్ చేయాలి. 

పాటించాల్సిన షరతుల్లో కొన్ని..

డెవలపర్లు తమ ప్లాన్స్ ఏమిటో ముందే ప్రపోజల్స్ లో పేర్కొనాలి. లైసెన్స్ వ్యవధి పూర్తయిన తర్వాత తిరిగి టూరిజం శాఖకే గెస్టు హౌస్ లను అప్పగించాల్సి ఉంటుంది. ఒక వేళ అగ్రిమెంట్ చేసుకున్న 12 నెలల్లో పనులు పూర్తి చేయకపోతే డిఫాల్ట్ గా పరిగణిస్తారు. ఎప్పటికప్పుడు సంబంధిత ఏజెన్సీల చెకింగ్ ఉంటుంది. ఆపరేట్ హోటల్/ రెస్టారెంట్​తో పాటు వాటికి రిలేటెడ్ యాక్టివిటీస్ ను సమానంగా నిర్వహించాలి. 3 నెలల కంటే ఎక్కువ గెస్ట్ హౌస్ లను మూసివేస్తే సంబంధిత అథారిటీ కారణాలను చెప్పాలి. ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించాలి. టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రమాణాలకు అనుగుణంగా రూమ్ లు, కిచెన్, రెస్టారెంట్లను నీట్ గా నిర్వహించాలి. ఏ నిర్మాణాలకైనా ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

రెంట్ ఎవరు ఎక్కువగా ఇస్తే వారికే.. 

ప్రైవేట్ వాళ్లతో డెవలప్ చేయించి రెంట్ తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం. డెవలపర్లు ఉన్న గెస్ట్ హౌస్ట్ లను తప్పనిసరిగా అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉంటే కొత్తవి కూడా కట్టుకోవచ్చు. ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ కింద డెవలపర్లకు ఇచ్చేసి వాళ్లు ఏటా ఇచ్చే రెంట్ లో10 శాతాన్ని ఇరిగేషన్ శాఖకు చెల్లిస్తాం. మినిమం ఇన్వెస్ట్ ఎంత చేయాలో నోటిఫికేషన్ లో ఇచ్చాం. గెస్ట్ హౌస్ తోపాటు ల్యాండ్ వినియోగానికి నెలకు రెంట్ ఎవరు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తే వారితో అగ్రిమెంట్ చేసుకుంటాం. టూరిజం, హోటల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోళ్లకు ప్రయార్టీ ఇస్తాం. 
- మనోహర్, ఎండీ, టూరిజం కార్పొరేషన్