కులగణనకు కట్టుబడి ఉన్నం

 కులగణనకు కట్టుబడి ఉన్నం
  • బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం: మంత్రి ఉత్తమ్
  • అందులో భాగమే మహేశ్​కుమార్ గౌడ్ కు పీసీసీ పదవి
  • భవిష్యత్తులోనూ ప్రభుత్వ, పార్టీ పదవుల్లో అవకాశాలుంటాయని వెల్లడి
  • బాధ్యతలు చేపట్టిన బీసీ కమిషన్ చైర్మన్, మెంబర్లు
  • అభినందనలు తెలిపిన ఉత్తమ్, ఎంపీ చామల, విప్ బీర్ల ఐలయ్య

హైదరాబాద్, వెలుగు: కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీ కమిషన్ ద్వారా కులగణన చేపడుతామని తెలిపారు. బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్​ప్రభుత్వ లక్ష్యమని.. అందులో భాగంగానే మహేశ్​ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. సోమవారం బీసీ కమిషన్ ప్రమాణ స్వీకారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా కులగణన చేపడుతామని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారని, ఇదే అంశంపై రాహుల్ పోరాడుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ప్రభుత్వ, పార్టీ పదవుల్లో  బీసీలకు అవకాశం ఇస్తామని ఆయన ప్రకటించారు.  

బీసీ కమిషన్ చైర్మన్, మెంబర్ల ప్రమాణ స్వీకారం

ఖైరతాబాద్​లోని బీసీ కమిషన్ కార్యాలయంలో  సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, మెంబర్లు బాలలక్ష్మి, తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో కమిషన్ మెంబర్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై గ్రీటింగ్స్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నిరంజన్ తనకు మిత్రుడని, నాలుగు దశాబ్దాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారన్నారు.

పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ ముగ్గురు నేతలను కమిషన్​ మెంబర్లుగా నియమించినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి జయ ప్రకాశ్ ఎంతో సేవ చేశారని, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ లీడర్ గా బాలలక్ష్మి కీలకంగా వ్యవహరించారని, జర్నలిజంలో ఎన్నో ఏండ్లుగా రచయితగా తిరుమలగిరి సురేందర్ ఉన్నారని ఉత్తమ్ గుర్తుచేశారు. కమిషన్ చైర్మన్ పోస్ట్ కు నిరంజన్ హుందాతనం తీసుకొస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీసీ కమిషన్ లో ఇద్దరు మెంబర్లను నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన జయ ప్రకాశ్ ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ లో ఎన్నో ఏండ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని ఎంపీ గుర్తుచేశారు. జనగామకు చెందిన బాలలక్ష్మి ఓయూ జేఏసీ లీడర్ గా ఇటీవల అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలకు, తుంగతుర్తి ఇన్ చార్జ్ గా పనిచేశారని చామల గుర్తుచేశారు. 


ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తాం: నిరంజన్

ప్రభుత్వం ఏ లక్ష్యంతో కమిషన్ ను ఏర్పాటు చేసిందో.. ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తామని బీసీ కమిషన్​ చైర్మన్ నిరంజన్ అన్నారు. బీసీలకు న్యాయం జరిగేలా పనిచేస్తామని, ఎవరికి ఎలాంటి అపోహలు, సందేహాలు వద్దని ఆయన స్పష్టం చేశారు. కులగణన, ఇతర సమస్యలపై అన్ని కులాల నేతలతో చర్చిస్తామని ప్రకటించారు. కమిషన్ కు ఎవరైనా రావొచ్చని, ఆందోళనలు వద్దని, చర్చించి సమస్యలు పరిష్కరించుకుం దామని ఆయన పిలుపునిచ్చారు.