పెండింగ్ ​ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయండి : ఉత్తమ్​ కుమార్​రెడ్డి

పెండింగ్ ​ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయండి : ఉత్తమ్​ కుమార్​రెడ్డి
  • ఇరిగేషన్​శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్​ ఆదేశాలు
  • సీతారామ, పాలమూరు, సమ్మక్కసాగర్​ నీటి కేటాయింపులు తేల్చండి
  • సీడబ్ల్యూసీతో ఎప్పటికప్పుడు మానిటర్​ చేయండి
  • కృష్ణా జలాలపై రోజూ రివ్యూ నిర్వహించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్టులు, ఎస్ఎల్​బీసీ సహా ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి  ఆదేశించారు. ప్రాజెక్టుల పనులపై రోజువారీ సమీక్షలను నిర్వహించాలని సూచించారు. బుధవారం సాయంత్రం జలసౌధలో ఇరిగేషన్​ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్​ దాస్, సెక్రటరీ రాహుల్​ బొజ్జా, స్పెషల్​సెక్రటరీ ప్రశాంత్​జీవన్​పాటిల్, ఈఎన్సీలు అనిల్​ కుమార్​, నాగేందర్​ రావు, ఇతర ఇరిగేషన్​శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్​ రివ్యూ నిర్వహించారు.

సమ్మక్క సాగర్​(తుపాకులగూడెం బ్యారేజీ), పాలమూరు– రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన నీటి కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)తో మానిటర్​ చేసుకోవాల్సిందిగా ఇరిగేషన్​ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్​ దాస్​, ఈఎన్సీ నాగేందర్​ రావును ఆదేశించినట్టు తెలిసింది.

ఎప్పటికప్పుడు దానిపై రివ్యూ చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. అలాగే, రోజువారీగా కృష్ణా జలాల వివరాలు తెలుసుకోవడంతోపాటు నేషనల్​గ్రీన్​ట్రిబ్యునల్​ అనుమతులపై సమాచారం తెలుసుకోవాలని సూచించినట్టు తెలిసింది. నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిందని, దానిపై ఈ నెల12న రివ్యూ చేయాలని ఆదిత్యనాథ్​దాస్​కు సూచించారు. 

వెంటనే ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లు  చేపట్టండి

ఇరిగేషన్​ శాఖలో ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్​ఆదేశించారు. ఈఎన్సీ, సీఈ, ఎస్ఈల పదోన్నతుల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.  వారితోపాటు ఈఈలు, డీఈల పదోన్నతులనూ పూర్తి చేయాలని తెలిపారు. నీటిపారుదల అంశాలపై ఎమ్మెల్యేలు, ఎంపీల రిప్రజెంటేషన్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. వారి సిఫార్సులపై నిర్ణీత గడువులోగా స్పందించాలని, కుదరకపోతే అదే చెప్పాలని సూచించినట్టు సమాచారం. 

5 టీఎంసీల నీళ్లివ్వండి.. కేఆర్ఎంబీకి ఏపీ లేఖ

ఏపీలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, ఆ గండం నుంచి గట్టెక్కేందుకు అర్జెంటుగా 5 టీఎంసీల నీళ్లను సాగర్​ ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలని కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డుకు ఏపీ లేఖ రాసింది. ఈ నెల 15న సాగర్​ కుడి కాలువ హెడ్​ రెగ్యులేటర్​ ద్వారా నీటిని విడుదల చేసుకునేందుకు పర్మిషన్​ఇవ్వాలని, తమ అధికారులను డ్యామ్​పైకి అనుమతించేలా సీఆర్​పీఎఫ్​ సిబ్బందికి ఆదేశాలివ్వాలని కోరింది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని గ్రామీణ నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన చెరువులు, సమ్మర్​స్టోరేజీ ట్యాంకులు పూర్తిగా ఎండిపోయాయని, ఆయా జిల్లాలకు తాగు నీటిని అందించాలంటే వాటిని అర్జెంటుగా నింపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.