- కృష్ణా నీళ్ల వాటాలో 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నవ్?
- ఏపీ నీళ్లను ఎత్తుకుపోతుంటే నోరెందుకు మూసుకున్నవ్?
- నువ్వు గొప్పగా చెప్పిన కాళేశ్వరం కుంగితే ఎందుకు మాట్లాడ్తలేవ్?
- అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని వెల్లడి
సూర్యాపేట, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్‌లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాది పడిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘‘కేసీఆర్, జగన్ బెస్ట్ ఫ్రెండ్స్. ప్రగతిభవన్‌లో వాళ్లిద్దరూ చర్చలు జరిపారు. ఆ వెంటనే కృష్ణా నదిపై రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌కు బీజం పడింది” అని చెప్పారు. కేసీఆర్, హరీశ్ రావు కృష్ణా ప్రాజెక్టులపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని.. కావాలనే లొల్లి చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీ పాలన కంటే, కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు నీళ్ల విషయంలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో 100 బెడ్స్ ఆసుపత్రికి మంత్రులు దామోదర, తుమ్మలతో కలిసి ఉత్తమ్ శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించేలా ఒప్పందం చేసుకున్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పకుండా ఇష్యూను పక్కదారి పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ రాయలసీమ లిఫ్ట్ ద్వారా ప్రతిరోజూ 8 టీఎంసీల నీళ్లు తరలించుకుపోతున్నదని.. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. రోజుకు 8 టీఎంసీల చొప్పున 203 టీఎంసీలను ఏపీ ఎత్తుకెళ్తున్నా అధికారంలో ఉన్నప్పుడు నోరెత్తని పెద్ద మనిషి.. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గ్రావిటీ ద్వారా 8 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే.. కేసీఆర్ మాత్రం 2 టీఎంసీలు తరలించేందుకు లక్ష కోట్లు వృథా చేశారని ఫైర్ అయ్యారు.
ప్రమాదంలో అన్నారం, సుందిళ్ల..
లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, అది మొత్తం కూలిపోయే స్థితికి చేరిందని ఉత్తమ్ చెప్పారు. బ్యారేజీల పరిస్థితిపై విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా వచ్చిందని తెలిపారు. కాళేశ్వరంలో మిగిలిన రెండు బ్యారేజీలు అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదంలో ఉన్నాయని వెల్లడించారు.
‘‘అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. మిగిలినవి కూడా కుంగిపోతున్నాయి. కానీ నాటి నుంచి నేటి వరకు వాటిపై కేసీఆర్ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గతంలో కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. అవి కుంగిపోవడంతో ఇప్పుడు కృష్ణా ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారు’’ అని మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.