- డిసెంబర్ 2026 నాటికి టన్నెల్ పనులు పూర్తి కావాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఇప్పటికే రూ.4,637 కోట్లు మంజూరు చేసినం
- బీఆర్‌ఎస్ హయాంలో చెక్ డ్యాముల నిర్మాణంలో అవకతవకలు
- వాటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోండి
- మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులపై సమీక్ష
- 12 లిఫ్టులకు ప్రతిపాదనలు.. వచ్చే ఆగస్టు కల్లా పూర్తి చేయాలని మంత్రి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. 2026 డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టును పూర్తవ్వాలని టైమ్ లైన్ విధించారు. 30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 4 వేల క్యూసెక్కులను తరలించేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. 44 కిలోమీటర్ల టన్నెల్‌లో ఇంకా 9.559 కిలోమీటర్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.4,637 కోట్లను విడుదల చేశామని తెలిపారు.
టన్నెల్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకోవచ్చని, లిఫ్టింగ్ ఖర్చులు ఉండవని, దీంతో ఏటా రూ.200 కోట్లు ఆదా అవుతాయని ఆయన వెల్లడించారు. ఫ్లోరైడ్ ప్రభావిత నల్గొండ జిల్లాకు ఈ ప్రాజెక్టు వల్ల మేలు జరుగుతుందని చెప్పారు. బుధవారం జలసౌధలో మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో కాంట్రాక్ట్ సంస్థల ఏజెన్సీలూ పాల్గొన్నాయి.
టన్నెల్‌ను తవ్వే బోరింగ్ మెషీన్ పాడైందని, దానిని దిగుమతి చేసుకోవాలని జేపీ అసోసియేట్స్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, మెషినరీని తెప్పించి పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనులను రూ.440 కోట్లు ఇచ్చామని, ఇది పూర్తయితే 4 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించొచ్చని పేర్కొన్నారు. డిండి ప్రాజెక్ట్ ద్వారా నల్గొండ జిల్లాలోని 3.41 లక్షల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కల్పించొచ్చని తెలిపారు. 200 గ్రామాలకు తాగు నీటి సౌకర్యాలు మెరుగవుతాయన్నారు. నక్కలగండి ప్రాజెక్ట్‌కు సంబంధించి అటవీ పర్మిషన్లకు ఉన్న అడ్డంకులు క్లియర్ చేసి, ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
చెక్ డ్యాముల నిర్మాణం పెద్ద కుంభకోణం..
చెక్ డ్యాముల నిర్మాణంలో బీఆర్‌ఎస్ సర్కార్ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయని, దానిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. చెక్ డ్యాముల నిర్మాణం పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న చెక్ డ్యాముల నాణ్యతను పరీక్షించాలని, అలాగే, అవసరమైతేనే కొత్తవి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో చేపట్టిన ప్రాజెక్టులు భూసేకరణ సమస్యతో ఆలస్యమవుతున్నాయని, ఈ సమస్యలను పరిష్కరించి, ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
భూసేకరణ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని చెప్పారు. నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్‌కు మరమ్మతులు చేయాలన్నారు. ఈ సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బి.లక్ష్మారెడ్డి, నీటి పారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జ తదితరులు పాల్గొన్నారు.
12 కొత్త లిఫ్టులకు ప్రతిపాదనలు..
దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో 12 కొత్త లిఫ్టులను ప్రతిపాదించినట్టు తెలిసింది. వీటి ద్వారా 95,423 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు అవకాశం ఉంటుందని చర్చించినట్టు సమాచారం. అందులో 23,532 ఎకరాలను స్థిరీకరించనున్నారు. ఆయా లిఫ్టులపై ఇరిగేషన్ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలను మంత్రికి వివరించినట్టు తెలిసింది. కృష్ణా, మూసీల నుంచి నీటిని వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుతం ఉన్న ఆయకట్టును స్థిరీకరించొచ్చని చెప్పినట్టు తెలుస్తున్నది. మొత్తం లిఫ్టుల ద్వారా 9.489 టీఎంసీల నీటిని అందుబాటులోకి తేనున్నారు. రూ.1,918.167 కోట్లతో వీటిని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి వీటిని పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించినట్టు తెలిసింది.