- హైదరాబాద్‌కు తాగునీటితో పాటు ఆయకట్టుకు నీళ్లు: మంత్రి ఉత్తమ్
- మంత్రి దామోదరతో కలిసి ఇరిగేషన్ అధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: సింగూరు, మంజీరా రిజర్వాయర్లతో పాటు నిజాంసాగర్‌కు గోదావరి జలాలను తరలిస్తామని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తద్వారా హైదరాబాద్ ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని, దాంతోపాటు సింగూరు, మంజీరా కింద కొత్త ఆయకట్టుకు నీరందిస్తామని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాజెక్టులపై బుధవారం జలసౌధలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహలు రివ్యూ చేశారు.
సింగూరు ప్రాజెక్టులో పూడికతీతపై ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రులు ఆదేశించారు. కేంద్రం రూపొందించిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, యుద్ధ ప్రాతిపదికన పూడిక తీయాలన్నారు. దీని వల్ల ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు వీలవుతుందన్నారు. సింగూరు కాలువల లైనింగ్‌కు టెండర్లను పిలవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను వెంటనే మొదలు పెట్టాలని స్పష్టం చేశారు.
పెద్దారెడ్డి ఎత్తిపోతలకు 660 కోట్లు!
పెద్దారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలనూ సిద్ధం చేసి పరిపాలనా అనుమతులు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. అనుమతులు వస్తే వచ్చే నెలాఖరునాటికి శంకుస్థాపన చేయొచ్చని సూచించారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.660 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. అర్ధంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని ప్యాకేజ్ 19ఏ పనులను వెంటనే పునరుద్ధరించాలని, అందుకు రూ.600 కోట్లు ఖర్చవుతాయని పేర్కొన్నారు.
ప్యాకేజ్ 17,18,19ల పనులను వేగవంతం చేయాలన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నల్లవాగు మీడియం ప్రాజెక్ట్ కెనాల్ మరమ్మతులతో పాటు మొత్తం జిల్లాలోని 38 చిన్న నీటిపారుదల చెరువుల రిపేర్లకు మంత్రి ఉత్తమ్ ఆమోదం తెలిపారు. కారముంగి ఎత్తిపోతల పథకానికి మంత్రి ఉత్తమ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.