- ఏషియన్ బ్యాంక్ ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ప్రాజెక్టులపై తీసుకున్న స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్వల్పకాలిక రుణాలతో భారం పెరిగిపోతుండటంతో దీర్ఘకాలిక రుణాల వైపు వెళ్లాలని, దీంతో వడ్డీపై వెసులుబాటు లభిస్తున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం జల సౌధలో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చే అంశంపై బ్యాంక్ ప్రతినిధులతో చర్చించారు. రుణాలను రీరూట్ చేయడం ద్వారా పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు వీలవుతుందని చెప్పారు.
‘‘దీర్ఘకాలిక రుణాలతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు వీలవుతుంది. కొత్త ఆయకట్టుకు నీటిని అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పనులు జరుగుతున్న ప్రాజెక్టులకూ ఈ రుణాలను వర్తింపజేయండి. వెనుకబడిన ప్రాంతాలతో పాటు గిరిజనులు అధికంగా ఉన్న ములుగు జిల్లా, ఫ్లోరోసిస్ ప్రభావిత ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ఈ రుణాలను వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు -రంగారెడ్డి, డిండిలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణాలు ఉపయోగించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసినట్టవుతుంది’’అని ఉత్తమ్ పేర్కొన్నారు. కాగా, ఏఐఐబీ ప్రతినిధులు, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావుతో సమావేశం నిర్వహించి దీర్ఘకాలిక రుణాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాను మంత్రి ఆదేశించారు. దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని, దీర్ఘకాలిక రుణాలతో తిరిగి చెల్లించే ఈఎంఐతో పాటు వడ్డీ చెల్లింపుల్లోనూ వెసులుబాటు దొరుకుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.