
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న ప్రారంభించనున్నట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 11న ట్రయల్ రన్ నిర్వహిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్ లోని జలసౌధలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున హైదరాబాద్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వైరాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన చెప్పారు.
అనంతరం సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 11న మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్టు రెండు, మూడు పంప్ హౌస్‌ల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అనంతరం వైరాలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు.
తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని అడవిదేవులపల్లి మండలం దున్నపోతుల గండికి చేరుకుని.. అక్కడ నిర్మించ తలపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్థలాన్ని ఉత్తమ్ పరిశీలిస్తారు. దానిపై మిర్యాలగూడలో రివ్యూ చేస్తారు. సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్ కుమార్, డిప్యూటీ ఈఎన్సీ కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.