భద్రాద్రి కొత్తగూడెం/ముల్కలపల్లి, వెలుగు: సీతారామ ప్రాజెక్టును రెండేండ్లలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రిఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి తరఫున తాను మాట ఇస్తున్నానని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెం వద్ద ప్రాజెక్టు రెండో పంప్‌హౌస్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉత్తమ్ ఆదివారం ట్రయల్‌రన్ నిర్వహించారు.
అనంతరం గోదావరికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్‌రన్ విజయవంతమైందని ప్రకటించారు. ‘‘గత ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో విఫలమైంది. ప్రాజెక్ట్‌కు నీటి కేటాయింపులు చేయించలేకపోయింది. మేంఅధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామకు 67 టీఎంసీల నీటి కేటాయింపులు తీసుకొచ్చాం.
ఈ ప్రాజెక్ట్‌ను మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యంగా తీసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇది హిస్టారిక్ డే” అని అన్నారు. ఈ నెల 15న వైరాలో నిర్వహించనున్న రైతు రుణమాఫీ కృతజ్ఞత సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని, అనంతరం సీతారామ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ‘‘నాగార్జున సాగర్ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణ కోసం వైరా లింక్‌కెనాల్ నిర్మాణం చేపట్టాం.
భూసేకరణ, డిస్ట్రిబ్యూటరీ కెనాల్పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడ్తున్నాం. ప్రతి ఏడాది 6 నుంచి 6.30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా సీఎం నాయకత్వంలో పని చేస్తున్నాం. ఐదేండ్లలో దాదాపు 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు అందిస్తాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని చెప్పారు.
సీతారామతో పాలేరుకు గోదావరి: తుమ్మల
సీతారామ ప్రాజెక్టులోభాగంగా చేపడుతున్న జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే పాలేరుకు గోదావరి జలాలు చేరుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ‘‘కృష్ణా జలాలు సకాలంలో రాకపోతే ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు తీసుకోవచ్చు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో భాగంగా యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాల్సి ఉంది. సీతారామ ప్రాజెక్టులో భాగంగా కొత్తూరు, పూసుగూడెం, కమలాపురంలోని మూడు పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి జలాలను 104 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లగలిగాం” అని తెలిపారు.
8 నియోజకవర్గాలకు నీళ్లు: పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం మినహా 8 నియోజకవర్గాలకు సీతారామ ప్రాజెక్ట్ద్వారా సాగు నీళ్లు అందనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక నేరవేరుతున్నదని చెప్పారు. ‘‘రూ.2,400 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కాదని.. గత ప్రభుత్వం రీడిజైనింగ్ పేరుతో రూ.18 వేల కోట్ల అంచనాతో సీతారామ ప్రాజెక్టు మొదలుపెట్టింది. దాదాపు రూ.8 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది” అని మండిపడ్డారు.
మేఘా ఉద్యోగులపై ఆగ్రహం..
కమలాపురంలోని మూడో పంప్‌హౌస్‌లో ట్రయల్ రన్ సాధ్యం కాదని చెప్పడంతో మేఘా కంపెనీ ఉద్యోగులపై మంత్రులు మండిపడ్డారు. పూసుగూడెంలోని రెండో పంప్ హౌస్ ట్రయల్ రన్ అనంతరం కమలాపురంలోని మూడో పంప్ హౌస్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి వెళ్లారు. సాంకేతిక కారణాలతో ట్రయల్ రన్ నిర్వహించలేకపోతున్నామని మేఘా ఉద్యోగులు చెప్పడంతో తుమ్మల ఫైర్ అయ్యారు.
రెండో పంప్‌హౌస్ నుంచి మూడో పంప్‌హౌస్‌లోకి నీళ్లు వచ్చేందుకు 24 గంటలు పడుతుందని చెప్పి, ఇప్పుడు 48 గంటలు పడుతుందని చెప్తున్నారేంటి? అని నిలదీశారు. సోమవా రం నాటికి పంప్‌హౌస్‌లు స్టార్ట్ చేసి చూపించాలని ఉత్తమ్ ఆదేశించారు. ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారని తెలిసి ఏర్పాట్లలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. సోమ, మంగళవారం కల్లా రెండు, మూడు పంప్ హౌస్‌లలోని మోటార్ల తో ట్రయల్ రన్ పూర్తి చేయాలన్నారు.