బీఆర్ఎస్ హయాంలోనే సుంకిశాల పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • వాటర్ వర్క్స్ వాళ్లు విచారణ చేస్తుండ్రు
  • సంఘటన చిన్నదే.. నష్టం తక్కువే
  • ఆందోళన వద్దు.. కాంట్రాక్టరే భరిస్తారు
  • ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు సరికాదు: గుత్తా

నల్లగొండ:బీఆర్ఎస్ హయాంలోనే సుంకిశాల పంప్ హౌజ్ పనులు జరిగాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ వ్యవసాయశాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఆయన సుంకిశాల పంప్ హౌజ్ ను సందర్శించారు.  కూలిపోయిన రిటైనింగ్ వాల్  ను పరిశీలించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలిసింది.. వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. వాటర్ వర్క్స్ వాళ్ళు విచారణ చేస్తున్నారని చెప్పారు. సీఎం వచ్చిన తరువాత వారితో చర్చించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో దక్షిణ తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందన్నారు. సుంకిశాల ఘటనపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జరిగిన ఘటన చిన్నదేనని, నష్టం కూడా తక్కువేనని, దానిని కాంట్రాక్టరే భరిస్తారని ఉత్తమ్ చెప్పారు.

 ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి, రెండు నెలలు నిర్మాణం ఆలస్యం అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్ఎల్బీసీని తాము పూర్తి చేస్తామని చెప్పారు.  డిండి ఎత్తిపోతల పనులు కూడా కంప్లీట్ చేస్తామన్నారు. బీఆర్ఎస్ ఎందుకు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.  

అసలు సుంకిశాల అవసరమే లేదు: గుత్తా

సుంకిశాల పంప్ హౌస్ ను ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్ కే తెలియాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.  జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల అవసరం లేదని అన్నారు. ఇది కేసీఆర్ మానస పుత్రికనో లేక కేటీఆర్ మానస పుత్రికనో అర్థం కావడం లేదని విమర్శించారు. కేటీఆర్ రాజకీయ విమర్శలు చేయడం సరికాదని.. కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేయడం సరికాదని గుత్తా పేర్కొన్నారు.