- మొత్తం ప్యాకేజీకి మేడిగడ్డే కీలకం
- రూ. 1800 కోట్లతో బ్యారేజీకి డిజైన్
- అంచనాలు పెంచి 4 వేల కోట్లకు..
- వందేండ్లు ఉండాల్సిన బ్యారేజీ మూడేళ్లకే కుంగింది
- అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగే ప్రమాదం
- డిజైన్, నిర్మాణం, నాణ్యత అంతా లోపాల పుట్ట
- గత ప్రభుత్వ పెద్దలే చీఫ్ ఇంజినీర్లు, డిజైనర్లు
- రాష్ట్రం మొత్తానికి కావాల్సిన కరెంటు కన్నా కాళేశ్వరానికి కావాల్సిందే ఎక్కువ
- ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ అన్నీ తప్పు పట్టాయి
- వాటి ఆధారంగా కచ్చితంగా చర్యలు తీసుకుంటం
- కూలే ప్రాజెక్టులు కట్టి మాకు అప్పగించుమంటుండ్రు
- అన్నారం బ్యారేజీ నుంచి కూడా లీకేజీలు స్టార్టయినై
- అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపలేమని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్యాకేజీ మొత్తానికి మేడిగడ్డ బ్యారేజీయే కీలకమని అన్నారు. వందేండ్లు ఉండాల్సిన ఈ బ్యారేజీ మూడేళ్లకే కుంగిపోయిందని చెప్పారు. డిజైన్, నిర్మాణం, నాణ్యత అంతా లోపాల పుట్ట అని తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలే చీఫ్ ఇంజినీర్లుగా, డిజైనర్లుగా వ్యవహరించి దీనిని నిర్మించారన అన్నారు. రాష్ట్రం మొత్తానికి కావాల్సిన కరెంటు కన్నా కాళేశ్వరం నీటిని ఎత్తిపోయడానికి అవసరమయ్యే ఖర్చే ఎక్కువని చెప్పారు. మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఇవాళ శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మేడిగడ్డ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణినికి వాస్తవానికి రూ. 1,800 కోట్లతో డిజైన్ చేశారని, దాని అంచనాలు పెంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు తెచ్చారని అన్నారు. ఇంత ఖర్చు చేసినా కట్టిన మూడేళ్లకే పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు. నిట్ల నిలువునా పగుళ్లు వచ్చాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను సభలో ఆయన ప్రదర్శించారు. మేడిగడ్డపై ఇంత జరుగుతున్నా మాజీ సీఎం కేసీఆర్ ఇంతవరకూ ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 81,911 వేల కోట్లకు సీడబ్ల్యూసీ అప్రూవ్ చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి కావడానికి 1,47,427.41 కోట్లు అవుతుందని చెప్పారు. ఇవాళ్టి లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ పూర్తికి రూ.2 లక్షల కోట్లు కావాలన్నారు.
బాధ్యులను వలిపెట్టం
‘మీరు తప్పుకుంటే బాగు చేస్తామంటున్నారు.. కట్టింది మీరే, ఈ పరిస్థితి కారణమే మీరు.. ఇంకా మీకు అర్హత ఉందా?’అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులో నాణ్యతా లోపం ఉందని ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఎక్కడా పరిశీలన జరగలేదన్నారు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కచ్చితంగా చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
అన్నారం బ్యారేజ్‌లోనూ లీకేజీ
నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్‌లో లీక్ మొదలైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అన్నారం బ్యారేజ్ కూడా కుంగేలా ఉందన్నారు. దీనిపై ఎన్డీఎస్ఏ అధికారులను కూడా పిలిపించినట్లు చెప్పారు. బ్యారేజ్‌లో నీటిని కొంతమేర ఖాళీ చేయాలని ఎన్డీఎస్ఏ అధికారులు సూచించినట్లు తెలిపారు. అన్నారం బ్యారేజ్‌కు కూడా ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ అధికారులు చెప్పారన్నారు.
కరెంటంతా మింగుతది
కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్ని మోటర్లు ఒకే సారి పనిచేస్తే రోజుకు 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ కావాలన్నారు. రాష్ట్ర అవసరాలకు మొత్తం 160 మిలియన్ యూనిట్లు చాలని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం మొత్తానికి కావాల్సిన విద్యుత్ కన్నా కాళేశ్వరం ప్రాజెక్టుకే ఎక్కువ కరెంట్ కావాలన్నారు. కరెంట్ ఖర్చే ఏడాదికి రూ.10,374 కోట్లు అవుతుందని చెప్పారు.
కృష్ణా జలాల్లోనూ గత సర్కారు అన్యాయం చేసింది
తెలంగాణకు న్యాయపరంగా కృష్ణా నదీ జలాల్లో 68శాతం వాటా రావాల్సి ఉందని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నది కేవలం 38 శాతం నీటికేనని ఉత్తం కుమార్ రెడ్డి చెప్పారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని అన్నారు. తెలంగాణకు 290 టీఎంసీ లు ఇస్తే చాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ లిఖిత పూర్వకంగా ఒప్పుకుందని అన్నారు. గత ప్రభుత్వం ఏపీకి 512 టీఎంసీల పంపిణీకి సంతకాలు చేసిందని కృష్ణా జలాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు.