
- డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించండి
- ఇరిగేషన్ శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
- ఎస్ఎల్బీసీ, పాలమూరు, డిండి, దేవాదుల ప్రాజెక్టులకు డెడ్ లైన్ పెట్టుకోండి
- రాజస్థాన్‌లో జరిగే మంత్రుల కాన్ఫరెన్స్‌కు ప్రజెంటేషన్సిద్ధంచేయండి
- పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయంలో సమర్థవంతమైన నీటి నిర్వహణపై దృష్టి పెట్టాలని, సూక్ష్మ సేద్యం ద్వారా రైతులకు నీళ్లిచ్చే విషయాలపై కసరత్తు చేయాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను అరికట్టేలా డ్రిప్ ఇరిగేషన్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ సిస్టమ్స్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో డేటాను సిద్ధం చేయాలన్నారు.
ఎస్ఎల్బీసీ, డిండి, పాలమూరు– రంగారెడ్డి, దేవాదులతోపాటు పలు లిఫ్ట్ స్కీమ్స్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఆయా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా డెడ్‌లైన్స్ పెట్టుకోవాలని, ఆ టైమ్‌లోపు ప్రాజెక్టులను పూర్తి చేయాలని తెలిపారు. రైతులకు నీళ్లిచ్చేందుకు ఆ ప్రాజెక్టులు చాలా కీలకమని, వాటిపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలని సూచించారు. ప్రస్తుతం నడుస్తున్న పనులను పర్యవేక్షించాలని, బాధ్యతగా ఉండాలని అన్నారు.
పనుల్లో నిర్లక్ష్యం వహించినా, అసమర్థంగా ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శనివారం జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిని మంత్రికి అధికారులు వివరించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకం పనులను పున:ప్రారంభించామని, ఒక మీటర్ వరకు శుక్రవారం తవ్వామని తెలిపారు.
పెండింగ్ బిల్లుల్లో కరెంట్చార్జీలను మినహాయిస్తున్నారని, వాటిని కూడా చెల్లించాలని మంత్రికి అధికారులు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఈ నెల 18, 19న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్న రెండో ఆలిండియా స్టేట్ వాటర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ 2025పైనా అధికారులతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లివ్వడం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి వంటి అంశాలపై కాన్ఫరెన్స్‌లో తెలంగాణ తరఫున ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో ప్రజెంటేషన్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఉత్తమ్ ఆదేశించారు.
తక్కువ ఖర్చుతో అయ్యే ప్రాజెక్టులకే ప్రాధాన్యం
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి, 30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో నీటి నిల్వను పెంచే విషయాలపైనా ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్ల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, నదుల అనుసంధానం, గ్రౌండ్ వాటర్‌ను మెరుగుపరచడంలాంటి వాటితో దీర్ఘకాలంలో నీటి కొరత రాకుండా ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్ల నిర్వహణపై ఓ నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. కాగా, ఈ సమావేశంలో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ అనిల్ కుమార్, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్, సీఈలు అజయ్ కుమార్, రమేశ్ బాబు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.